INDvs ENG: వాంఖడేలో సిక్స్‌ల సునామీ.. టీమిండియా భారీ స్కోరు

INDvs ENG: వాంఖడేలో సిక్స్‌ల సునామీ.. టీమిండియా భారీ స్కోరు

వాంఖడే వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న నామమాత్రమైన ఆఖరి టీ20లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ వీరవిహారం చేశాడు. ఏకంగా సెంచరీ బాదిన ఈ లెఫ్ట్ హ్యాండర్.. జట్టులోని పదకొండు మంది ఆట ఒక్కడే ఆడేశాడు. ఇతడి ధాటికి టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 247 పరుగుల భారీ స్కోర్ చేసింది.

17 బంతుల్లో యాభై.. 37 వంతుల్లో వంద.. 54 బంతుల్లో 135.. ఇలా హైదరాబాద్ ఓపెనర్ వాంఖడే గడ్డపై విధ్వంసం సృష్టించాడు. మైదానం నలుమూలలా సిక్సర్లు బాదుతూ అభిమానులను అలరించాడు. మొత్తంగా 55 బంతులు ఎదుర్కొన్న అభిషేక్ 7 ఫోర్లు, 13 సిక్స్‌ల సాయంతో 135 పరుగులు చేశాడు. మరో ఎండ్ లో శివం దూబే(13 బంతుల్లో 30; 3 ఫోర్లు, 2 సిక్స్‌లు), తిలక్ వర్మ(15 బంతుల్లో 24; 3 ఫోర్లు, ఒక సిక్స్‌) పర్వాలేదనిపించారు.

ఇంగ్లండ్ బౌలర్లలో మార్క్ వుడ్(32/2), బ్రైడన్ కార్సే(38/3) ఇద్దరూ పరుగులు కట్టడి చేయడంలో కాస్త సఫలమయ్యారు. జోఫ్రా ఆర్చర్ 4 ఓవర్లలో 55, ఆదిల్ రషీద్ 3 ఓవర్లలో 41, జామీ ఓవర్టన్ 3 ఓవర్లలో 48, లివింగ్‌స్టోన్ 2 ఓవర్లలో 29 పరుగులు సమర్పించుకున్నారు.