IND vs ENG 1st T20I: తొలి టీ20 మనదే.. చిత్తుచిత్తుగా ఓడిన ఇంగ్లాండ్

IND vs ENG 1st T20I: తొలి టీ20 మనదే.. చిత్తుచిత్తుగా ఓడిన ఇంగ్లాండ్

ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా బోణీ కొట్టింది. కోల్‌కతా, ఈడెన్‌ గార్డెన్స్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన తొలి టీ20లో 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. మొదట బౌలర్లు విజృంభించగా.. ఆ తరువాత బ్యాటర్లు మిగిలిన పని పూర్తి చేశారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఏకపక్షంగా మ్యాచ్ ముగిసింది. తొలుత ఇంగ్లాండ్‌ను 132 పరుగులకే కట్టడిచేసిన టీమిండియా.. అనంతరం స్వల్ప లక్ష్యాన్ని 12.5 ఓవర్లలోనే చేధించింది. 

అభిషేక్ ఊచకోత

ఛేదనలో సంజు శాంసన్ (26; 4 ఫోర్లు, ఒక సిక్స్) మెరుపు ఆరంభాన్ని ఇవ్వగా.. ఎప్పటిలానే అభిషేక్ శర్మ (34 బంతుల్లో 79; 5 ఫోర్లు, 8 సిక్స్‌లు) ఇంగ్లీష్ బౌలర్లను ఊచకోత కోశాడు. మార్క్ వుడ్ వేసిన పవర్ ప్లే ఆఖరి ఓవర్‌లో 6,6,4 బాదిన SRH ఓపెనర్.. ఆదిల్ రషీద్ వేసిన ఇన్నింగ్స్‌ ఎనిమిదో ఓవర్‌లో చివరి మూడు బంతులకు వరుసగా 4,6,6 బాదాడు. అతని కొట్టిన సిక్సర్ల దెబ్బకు ఇంగ్లీష్ ఫీల్డర్లకు ఆకాశం వైపు చూడటం తప్ప మరో దారే కనిపించలేదు.

అభిషేక్ ధాటికి టీమిండియా 10 ఓవర్లు ముగిసేసరికి సరిగ్గా 100 పరుగులు చేసింది. అట్కిన్సన్‌ వేసిన ఆ మరుసటి ఓవర్‌లో వరుసగా రెండు సిక్సర్లు బాదాడు. అప్పటికే, మ్యాచ్ ఫలితం తేలిపోవడంతో.. ఇంగ్లీష్ బౌలర్లు చేతులెత్తేశారు. మరో 43 బంతులు మిగిలివుండగానే భారత బ్యాటర్లు లక్ష్యాన్ని చేధించారు. ఈ మ్యాచ్ లో సూర్యకుమార్ యాదవ్(0) డకౌట్ అవ్వడం ఒక్కటే భారత అభిమానులను నిరాశ పరిచిన విషయం.

చుట్టేసిన భారత బౌలర్లు

అంతకుముందు భారత బౌలర్లు విజృంభించడంతో ఇంగ్లాండ్ నిర్ణీత ఓవర్లలో 132 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లీష్ బ్యాటర్లలో కెప్టెన్ జోస్ బట్లర్ (68; 44 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) టాప్ స్కోరర్. మరో ఎండ్‌లో వచ్చిన వారు వచ్చినట్టుగా వెంటవెంటనే వీడుతున్నా.. తాను మాత్రం ఒంటరి పోరాటం చేశాడు. అతని తరువాత హ్యారీ బ్రూక్ (17), జోఫ్రా ఆర్చర్ (12) మాత్రమే రెండెంకెల స్కోర్ చేయగలిగారు. మిగిలిన బ్యాటర్లంతా విఫలం. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి 3 వికెట్లు పడగొట్టగా.. అర్ష్‌దీప్ సింగ్, హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ తలో రెండు వికెట్లు తీసుకున్నారు.