Team India: అవయవ దానం చేయండి.. ప్రాణాలు పోయండి.. పిలుపునిచ్చిన భారత క్రికెటర్లు

Team India: అవయవ దానం చేయండి.. ప్రాణాలు పోయండి.. పిలుపునిచ్చిన భారత క్రికెటర్లు

క్రికెటర్లు అంటే ఎప్పుడు మ్యాచ్‌లు, టూర్లు, వాణిజ్య ప్రకటనల షూటింగ్ ల బిజీ బిజీగా గడిపేస్తుంటారనేది అందరి అభిప్రాయం. సమాజం గురించి పట్టించుకోరని.. సామాజిక అంశాలపై స్పందించరని అపోహ. ఈ అభిప్రాయాలు పూర్తిగా నిరాధారం. అవకాశం దొరికిన ప్రతిసారి క్రికెటర్లు సమాజం కోసం, తమ అభిమానుల కోసం ఏదో ఒక మంచి పని చేయడానికి ముందుకొస్తుంటారు. 

అప్పుడప్పుడు కొన్ని మ్యాచ్‌ల్లో ప్రత్యేక జెర్సీలు ధరించి క్యాన్సర్‍పై అవగాహన, మహిళా సాధికారిత వంటి సామాజిక అంశాలపై అవగాహన కల్పించడం చూశాం.. ఇప్పుడు ఈ జాబితాలోకి మరో అంశం చేరింది. ‘అవయవ దానం చేయండి.. ప్రాణాలను కాపాడండి’ (Donate Organs, Save Lives) అనే నినాదంతో భారత క్రికెటర్లు ముందుకు కదిలారు. 

Also Read :- పాక్ క్రికెటర్ తో ప్రేమలో పడిన యంగ్ మోడల్

అహ్మదాబాద్‌ స్టేడియం వేదికగా బుధవారం(ఫిబ్రవరి 12) భారత్- ఇంగ్లండ్‌ మధ్య మూడో వన్డే జరగనుంది. ఈనేపథ్యంలో అవయవదానాన్ని ప్రోత్సహించడానికి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఒకరు మరణించిన తరువాత కూడా జీవించేందుకు అత్యుత్తమ మార్గం అవయవదానం. చనిపోయిన వ్యక్తుల గుండె, కాలేయం, కిడ్నీలు, క్లోమగ్రంధి, ఊపిరి తిత్తులు, చిన్నపేగు, కార్నియా, చర్మం, నరాలు, గుండె కవాటాలు దానం చేయొచ్చు. తద్వారా మనిషి భౌతికంగా లేకపోయినా మరికొందరి జీవితాల్లో వెలుగులు నింపవచ్చు. దీనిపై అవగాహన కల్పించేందుకు క్రికెటర్లు నడుం బిగించారు.

ఒక ప్రతిజ్ఞ, ఒక నిర్ణయం, ఎందరో ప్రాణాలు కాపాడుతుంది. మనందరం కలిసి వచ్చి మార్పు తీసుకొద్దాం.. అని విరాట్ కోహ్లీ , శుభ్‌మాన్ గిల్, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ సహా పలువురు క్రికెటర్లు పిలుపులిచ్చారు. అందుకు సంబంధించిన వీడియోను బీసీసీఐ సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.