- సిరీస్ చిక్కేనా! నేడు ఇంగ్లండ్‌తో ఇండియా నాలుగో టీ20 మ్యాచ్
- రా.7 నుంచి స్టార్‌స్పోర్ట్స్, హాట్‌స్టార్‌లో లైవ్
పుణె: ఇంగ్లండ్‌తో టీ20 సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయాలు సాధించి మూడో పోరులో తడబడిన టీమిండియా కీలక సవాల్‌కు సిద్ధమైంది. గత మ్యాచ్‌లో బయటపడ్డ బలహీనతలను సరిదిద్దుకొని శుక్రవారం జరిగే నాలుగో టీ20 మ్యాచ్‌లో గెలుపే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. పుణెలోనే సిరీస్‌ను చేజిక్కించుకుంటే ఆఖరాటలో ప్రయోగాలు చేసే అవకాశం ఇండియాకు లభిస్తుంది. అది జరగాలంటే సూర్యకుమార్ సేన ఇన్నింగ్స్‌ను మెరుగ్గా ఆరంభించడంతో పాటు ముగింపులోనూ మెరుగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. ఇక,రాజ్‌కోట్‌లో టీమిండియాను దెబ్బకొట్టి సిరీస్ రేసులో నిలిచిన ఇంగ్లండ్ మరో విజయంతో 2–2తో లెక్క సరిచేయాలన్న కృతనిశ్చయంతో ఉంది.
శాంసన్, సూర్య ఫామ్‌పై ఆందోళన
బంగ్లాదేశ్‌పై ఒకటి, సౌతాఫ్రికాపై రెండు సెంచరీలతో ఈ ఫార్మాట్‌లో సూపర్ ఫామ్‌లో కనిపించిన సంజూ శాంసన్ తాజా సిరీస్‌లో అంచనాలను అందుకోవడం లేదు. మూడు ఇన్నింగ్స్‌ల్లో అతను 26, 5, 3 స్కోర్లతో నిరాశ పరిచాడు. ఈ కారణంగా ఇండియాకు సరైన ఆరంభం లభించడం లేదు. ఈ సిరీస్‌లో ఎక్కువ పేస్‌తో వస్తున్న బాల్స్‌ను ఎదుర్కోవడంలో తడబడుతున్నాడు. సంజూ ఈ బలహీనతను తక్షణమే సరిదిద్దుకుంటే మంచింది. గత మూడు ఇన్నింగ్స్‌ల్లో 1, 12, 14 స్కోర్లతో తీవ్రంగా నిరాశ పరిచిన సూర్యకుమార్ యాదవ్ జట్టును ముందుండి నడిపించే బాధ్యత తీసుకోవాలి. తిలక్ వర్మ ఫామ్‌లో ఉండగా.. గత మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యా ఒంటరి పోరాటం చేసినా అతని స్ట్రయిక్ రేట్‌పై విమర్శలు వచ్చాయి. ఇక గత రెండు మ్యాచ్‌ల్లో ఏడో నంబర్‌లో బరిలోకి దిగిన ధ్రువ్ జురెల్ వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వెన్ను నొప్పి కారణంగా గత రెండు మ్యాచ్‌లకు దూరంగా ఉన్న రింకూ సింగ్ జురెల్ ప్లేస్‌లో తుది జట్టులోకి రానున్నాడు. రింకూ గతంలో మాదిరిగా భారీ షాట్లతో తన మార్కు చూపెడతాడేమో చూడాలి.
ఆత్మవిశ్వాసంలో బట్లర్‌సేన
రాజ్‌కోట్ మ్యాచ్‌లో విజయంతో ఇంగ్లండ్ తిరిగి ఆత్మవిశ్వాసం ప్రోది చేసుకుంది. ఆ పోరులో బట్లర్‌సేన బ్యాటింగ్‌తో పాటు బౌలింగ్‌లోనూ ఇండియా కంటే మెరుగ్గా ఆడింది. ఓపెనర్ బెన్ డకెట్ ఫిఫ్టీతో ఫామ్ అందుకోగా.. మిడిలార్డర్‌లో లివింగ్‌స్టోన్ కూడా టచ్‌లోకి రావడంతో ఆ జట్టు బలం పెరిగినట్టయింది. స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్ రాజ్‌కోట్‌లో రెండు వికెట్లతో గాడిలో పడగా.. జెమీ ఓవర్టన్ కూడా సత్తా చాటడం ఆ జట్టుకు శుభసూచకం. స్పిన్నర్ ఆదిల్ రషీద్ మొదటి నుంచి ఇండియా బ్యాటర్లకు సవాల్ విసురుతున్నాడు. పుణె పిచ్ సంప్రదాయంగా స్పిన్నర్లకు సహకరిస్తుంది. కాబట్టి ఆదిల్ విషయంలో ఇండియా బ్యాటర్లు జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది.