IND vs ENG: ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నారా..! ఏమనుకున్నారు..?: స్టేడియం నిర్వాహకులకు నోటీసులు

IND vs ENG: ఇంటర్నేషనల్ మ్యాచ్ అనుకున్నారా..! ఏమనుకున్నారు..?: స్టేడియం నిర్వాహకులకు నోటీసులు

కటక్‌, బారాబతి స్టేడియం వేదికగా భారత్‌- ఇంగ్లాండ్‌ మధ్య ఆదివారం(ఫిబ్రవరి 09) జరిగిన రెండోవన్డే బీసీసీఐపై విమర్శలకు దారితీసింది. ఫ్లడ్‌లైట్స్‌ కారణంగా మ్యాచ్ అరగంట పాటు ఆగిపోవడంతో అభిమానులు బీసీసీఐపై విరుచుకుపడ్డారు. అత్యంత ధనిక బోర్డుగా చెలామణి అవుతున్న భారత క్రికెట్ నియంత్రణా మండలి.. ఓ అంతర్జాతీయ మ్యాచ్‌ను సరిగ్గా నిర్వహించలేకపోతోందని విమర్శలు ఎక్కుపెట్టారు. ఈ క్రమంలో ఒడిశా ప్రభుత్వం అప్రమత్తమైంది. 

ఒడిశా క్రీడా డైరెక్టర్ సిద్ధార్థ దాస్ సోమవారం(ఫిబ్రవరి 10).. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (OCA)కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. జరిగిన తప్పిదంపై 10 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అటువంటి లోపాలకు కారణమైన వ్యక్తులు/ ఏజెన్సీలను గుర్తించి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలను వివరించాలని నోటీసుల్లో పొందుపరిచారు. ఎంతో బ్రతిమలాడితే కానీ, ఆతిథ్య హక్కులు దక్కవని.. అటువంటిది ఫ్లడ్‌లైట్ల సమస్య బీసీసీఐని, ఒడిశా ప్రభుత్వాన్ని  తలదించుకునేలా చేసిందని ఆయన లేఖలో ప్రస్తావించారు. ఒడిశా క్రికెట్ అసోసియేషన్ (OCA)కు అధ్యక్షుడు లేనందున కార్యదర్శి సంజయ్ బెహెరాకు నోటీసులు పంపారు.

Also Read :- అరంగేట్ర వన్డేలోనే సఫారీ బ్యాటర్ ప్రపంచ రికార్డు

అసలేం జరిగిందంటే..?

ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ అయిపోగా.. భారత బ్యాటింగ్ మొదలైన కొద్దిసేపటికే ఫ్లడ్‌లైట్ సమస్య తలెత్తింది. సరిగ్గా 6.1 ఓవర్ల తర్వాత ఫ్లడ్‌లైట్ ఆగిపోయాయి. దాంతో, మ్యాచ్ 30 నిమిషాల పాటు నిలిచిపోయింది. అప్పటికే, ధాటిగా ఆడుతోన్న భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మాన్ గిల్‌లు నిరాశతో డగౌట్‌కు వెళ్లిపోయారు. ఆ సమయంలో ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝి, ఇతర సీనియర్ మంత్రులు స్టేడియంలోనే ఉన్నారు.