జనవరి 25 నుంచి భారత్, ఇంగ్లాండ్ మధ్య 5 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. ఈ సిరీస్ ప్రారంభం కావడానికి ఇంకా మూడు రోజుల సమయం ఉండగానే..ఇంగ్లాండ్ ఆటగాళ్లు నోటికి పని చెప్తున్నారు. మాటలతో భారత క్రికెటర్లను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. తద్వారా మైండ్ గేమ్‌తో భారత బ్యాటర్లను ఇబ్బంది పెట్టాలనేది వారి ఆలోచన. ఇంగ్లండ్ స్పీడ్ గన్ ఓలీ రాబిన్సన్.. కోహ్లీని ఉద్దేశిస్తూ అలాంటి వ్యాఖ్యలే చేశారు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీకి ఈగో ఎక్కువన్న రాబిన్సన్.. అతన్ని ఎదుర్కోవడానికి తాను ఎదురు చూస్తున్నట్లు తెలిపాడు. ఈ క్రమంలో గతంలో జరిగిన కొన్ని గొడవలను కూడా అతను ప్రస్తావించాడు. "ఏ క్రికెటరైనా.. అత్యుత్తమ ఆటగాళ్లతో ఆడాలని కోరుకుంటారు. అత్యుత్తమ ఆటగాళ్లను అవుట్ చేయాలనుకుంటున్నారు. నేనూ అంతే.."
"ప్రస్తుత తరంలో కోహ్లీ గొప్ప ఆటగాళ్లలో ఒకరు. కాకపోతే అతనికి ఇగో ఎక్కువ. నిలకడగా ఆడుతూనే బౌలర్లపై ఆధిపత్యం చెలాయించాలని కోరుకుంటారు. ముఖ్యంగా భారతదేశంలో ఆడుతున్నప్పుడు వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయాలని కోరుకుంటాడు. గతంలో మేము గొడవ పడిన సందర్భాలు వాస్తవమే. అందుకే అతనితోపోటీ మరింత ఉత్సాహంగా ఉంటుంది.." అని రాబిన్సన్ ఈఎస్‌పిఎన్ ఇంటర్వ్యూలో వెల్లడించారు.
మాటల యుద్ధం
2021లో ఇంగ్లండ్ జట్టు.. ఇండియా పర్యటనలో రాబిన్సన్, కోహ్లీ మధ్య మాటల యుద్ధం జరిగింది. మహ్మద్ సిరాజ్ వేసిన ఓ బంతి రాబిన్సన్ ఛాతీకి తగలగా.. అతను నొప్పితో విలవిలలాడాడు. ఆ సమయంలో కోహ్లీతో పాటు భారత క్రికెటర్లు అందరూ అతన్ని చుట్టుముట్టారు. ఈ ఘటనను అతను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ఆ సమయంలో కోహ్లీ అన్న మాటలు తాను మర్చిపోయానని తెలిపాడు. అదే సమయంలో ఉపఖండ పిచ్‌లపై సీమింగ్ డెలివరీస్‌ను ఎలా ఎదుర్కోవాలో ప్రాక్టీస్ చేస్తున్నట్లు వెల్లడించాడు. కోహ్లీని ఉద్దేశిస్తూ అతను చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మిడియాలో ఇరు దేశాల అభిమానుల మధ్య అగ్గి రాజేస్తున్నాయి.
ఇండియా - ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ షెడ్యూల్
- మొదటి టెస్ట్ (జనవరి 25 - జనవరి 29): హైదరాబాద్
- రెండో టెస్ట్ (ఫిబ్రవరి 02 - ఫిబ్రవరి 06): విశాఖపట్నం
- మూడో టెస్ట్ (ఫిబ్రవరి 15 - ఫిబ్రవరి 19) : రాజ్‌కోట్
- నాలుగో టెస్ట్ (ఫిబ్రవరి 23 - ఫిబ్రవరి 27): రాంచీ
- ఐదో టెస్ట్(మార్చి 7 - మార్చి 11): ధర్మశాల
ఇంగ్లండ్ జట్టు: బెన్ స్టోక్స్ (కెప్టెన్), రెహాన్ అహ్మద్, జేమ్స్ ఎమర్సన్, గుస్ అట్కిన్సన్, జానీ బెయిర్‌స్టో, షోయబ్ బషీర్, హ్యారీ బ్రూక్, జాక్ క్రాలే, బెన్ డకెట్, బెన్ ఫోక్స్, టామ్ హార్ట్లీ, జాక్ లీచ్, ఒల్లీ పోప్, ఆలీ రాబిన్సన్, జో రూట్, మార్క్ వుడ్.
భారత జట్టు(మొదటి రెండు టెస్టులకు): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), మహ్మద్ సిరాజ్, ముఖేష్ కుమార్, అవేష్ ఖాన్.