భారత్- ఇంగ్లాండ్ పోరుకు సర్వం సిద్ధమైంది. గురువారం(జనవరి 25) నుంచి ఉప్పల్ వేదికగా టెస్ట్ సిరీస్ ప్రారంభంకానుంది. సొంతగడ్డపై ఎదురులేని భారత్‌ను.. బజ్‌బాల్ ఆటతో హోరెత్తిస్తున్న ఇంగ్లాండ్ జట్టు ఏ మేరకు అడ్డుకుంటుందనేది ఆసక్తికర అంశం. స్పిన్‌కు అనుకూలించే ఉప్పల్ పిచ్‌పై ఇరు జట్లు స్పిన్ అస్త్రాలతోనే బరిలోకి దిగుతున్నాయి. ఈ క్రమంలో ఉప్పల్ స్టేడియం గత టెస్ట్ ఎలా రికార్డులు ఎలా ఉన్నాయి..? పిచ్ ఎవరికి సహకరించనుంది అనేది తెలుసుకుందాం..
టీమిండియా అడ్డా
ఉప్పల్ స్టేడియం టీమిండియాకు పెట్టని కోట. టెస్టుల్లో మన జట్టు హైదరాబాద్ గడ్డపై ఓడిందే లేదు. ఇప్పటివరకూ ఉప్పల్ స్టేడియంలో భారత జట్టు ఐదు టెస్టులు ఆడగా.. నాలుగింట విజయం సాధించింది. మరోకటి డ్రాగా ముగిసింది. ఈ నేపథ్యంలో భారత జట్టు సాధించిన విజయాలపై హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్ సీఏ) స్పెషల్ వీడియో పోస్ట్ చేసింది.
మొదటిసారి 2010లో భారత్, న్యూజిలాండ్ మధ్య టెస్టు జరగ్గా.. అది డ్రాగా ముగిసింది. అనంతరం భారత జట్టు.. వరుసగా కివీస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, వెస్టిండీస్‌లపై విజయాలు నమోదు చేసింది.
1). 2010లో భారత్, న్యూజిలాండ్ మధ్య జరిగిన తొలి టెస్ట్ డ్రాగా ముగిసింది. ఆ మ్యాచ్ లో భారత మాజీ స్పిన్ దిగ్గజం హర్బజన్ సింగ్(111) సెంచరీ చేయగా.. వీరేంద్ర సెహ్వాగ్(96) పరుగులు చేశాడు.
2). 2012లో మరోసారి న్యూజిలాండ్ జట్టే మన ప్రత్యర్థి కాగా, ఈ మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్, 115 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఛటేశ్వర్ పుజారా (159) సెంచరీ చేయగా.. అశ్విన్ 12 వికెట్లు పడగొట్టాడు.
3). అనంతరం 2013లో ఆస్ట్రేలియాతో జరిగిన కీలక మ్యాచ్ లో టీమిండియా ఇన్నింగ్స్, 135 పరుగుల తేడాతో గెలుపొందింది. పుజారా (204) డబుల్ సెంచరీ చేయగా.. మురళీ విజయ్(167) సెంచరీ చేశాడు.
4). ఇక 2017లో బంగ్లాదేశ్‌తో ఏకైక టెస్టులో టీమిండియా 208 పరుగుల తేడాతో విజయం సాధించింది. విరాట్ కోహ్లి (204) డబుల్ సెంచరీ చేయగా.. మురళీ విజయ్(108), వృద్ధిమాన్ సాహా(106) సెంచరీలు చేశారు.
5). ఇక చివరిసారిగా 2018లో వెస్టిండీస్‌తో జరిగిన టెస్టులో టీమిండియా 10 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఆ మ్యాచ్‌లో భారత పేసర్ ఉమేశ్ యాదవ్ 10 వికెట్లు పడగొట్టాడు.
Ever since their first Test match in 2010, India has not lost a single Test match at #RajivGandhiInternationalCricketStadium. Ye maidan nahi, kila hai!!! ?✨ Brace yourselves because even after the #IndvEng Test match starting on January 25th, this FORTRESS will stand… pic.twitter.com/gW5PSqb9Do
— hydcacricket (@hydcacricket) January 23, 2024
స్పిన్ ప్రభావమెంత..?
గణాంకాలను బట్టి చూస్తే ఉప్పల్‌లో స్పిన్నర్లదే ఆధిపత్యం. ఇప్పటివరకూ ఈ వేదికపై టెస్టుల్లో అత్యధిక వికెట్లు తీసిన ఐదుగురు బౌలర్లలో నలుగురు స్పిన్నర్లే. 8 ఇన్నింగ్స్‌ల్లో 27 వికెట్లతో రవిచంద్రన్ అశ్విన్ అగ్రస్థానంలో ఉన్నాడు. మొదటి రెండ్రోజులు పేసర్లు ప్రభావం చూపే అవకాశాలు ఉన్నప్పటికీ.. మూడో రోజు నుంచి పిచ్ స్పిన్నర్లకు స్వర్గధామంగా మారుతుంది. ఈ పిచ్‌పై చివరి రెండు రోజులు బ్యాటింగ్ చేయడం చాలా కష్టం.