ఉప్పల్ లో జరిగిన మొదటి టెస్టు మ్యాచ్ లో ఓడిపోయి లీడింగ్ లో వెనుకబడిన టీమిండియాకు వరుసగా సీనియర్ ఆటగాళ్లు దూరం అవుతుండటం కలవర పెడుతుంది. ఇప్పటికే గాయం కారణంగా రాహుల్, జడేజా రెండో టెస్టుకు దూరమయ్యారు. ఇప్పుడు కోహ్లీ కూడా దూరం కానున్నట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాలతో మొదటి రెండు టెస్టు మ్యాచ్ లకు దూరంగా ఉన్న కోహ్లీ.. ఇప్పుడు మిగతా మూడు టెస్టులకు కూడా అందుబాటులో ఉండడని సమాచారం.
కోహ్లీ తల్లి సరోజ్ లీవర్ సమస్యతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. ఆమెను దగ్గరుండి చూసుకునేందుకు కోహ్లీ మిగతా టెస్టులకు దూరం అవుతున్నట్లు సమాచారం. దీనిపై బీసీసీఐ అఫీషియల్ గా స్పందించాల్సి ఉంది. కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా గాయపడటంతో వారి స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ , సౌరభ్ కుమార్, వాషింగ్టన్ సుందర్‌లను టెస్ట్ జట్టులోకి తీసుకుంది.
వైజాగ్ లో ఫిబ్రవరి 02 నుంచి ఇంగ్లండ్ తో రెండో టెస్టు జరగనుంది. దీని కోసం ఇరు జట్లు ఇప్పటికే వైజాగ్ కు చేరుకుంది. ఇంగ్లండ్ తో జరగబోయే మిగిలిన మూడు టెస్టు మ్యాచ్ లకు జట్టును ఎంపిక చేసే పనిలో ఉంది బీసీసీఐ. దీనిపై త్వరలో ముంబైలో సమావేశం కానుంది.