IND vs ENG: ముగిసిన తొలిరోజు ఆట.. డబుల్ సెంచరీ దిశగా జైస్వాల్

IND vs ENG: ముగిసిన తొలిరోజు ఆట.. డబుల్ సెంచరీ దిశగా జైస్వాల్

విశాఖ వేదికగా ఇంగ్లాండ్‌తో జరుగుతున్న రెండో టెస్టులో టీమిండియా భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. భారత యువ ఓపెనర్‌ యశస్వీ జైస్వాల్‌(179 నాటౌట్) సెంచరీతో కదం తొక్కాడు. రోహిత్, గిల్, అయ్యర్ వంటి సీనియర్లు విఫలమైన చోట ఇంగ్లాండ్ బౌలర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. వరుస విరామాల్లో వికెట్లు పడుతున్నా.. విలువైన భాగస్వామ్యాలు నెలకొల్పుతూ భారీ స్కోరుకు పునాదులు వేశాడు. రోహిత్ శర్మ(14), గిల్‌ (34), శ్రేయాస్ అయ్యర్(27), పటీదార్‌(32), అక్సర్ పటేల్(27) పరుగులు చేశారు. దీంతో తొలిరోజు ఆట ముగిసేసరికి భారత జట్టు 93 ఓవర్లలో 6 వికెట్లు కొల్పోయి 336 పరుగులు చేసింది.

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు రోహిత్ శర్మ(14), యశస్వి జైస్వాల్‌ మంచి ఆరంభాన్ని ఇచ్చారు.. వీరిద్దరూ తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని షోయబ్ బషీర్ విడగొట్టాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన శుభ్‌మన్‌ గిల్‌(34) కుదురుకున్నట్లు అనిపించినా.. ఆండర్సన్ బౌలింగ్‌లో వెనుదిరిగాడు. ఆ సమయంలో శ్రేయాస్ అయ్యర్- జైస్వాల్ జోడి భారత ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. నిలకడగా ఆడుతూ స్కోర్ బోర్డును ముందుకు నడిపించారు. ఈ క్రమంలో జైస్వాల్ 151 బంతుల్లో సెంచరీ మార్క్ చేరుకున్నాడు.

అనంతరం టామ్ హార్ట్ లీ.. ఈ జోడీని విడగొట్టాడు. ఓ చక్కని బంతితో అయ్యర్(27) ని పెవిలియన్ చేర్చాడు. అతని స్థానంలో క్రీజులోకి వచ్చిన పటీదార్(32) అరంగ్రేట మ్యాచ్‌లోనే పర్వాలేదనిపించాడు. అతని నుంచి భారీ ఇన్నింగ్స్ ఆశించే సమయాన రెహాన్ అహ్మద్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. ఆపై క్రీజులోకి వచ్చిన అక్షర్‌ పటేల్‌ (27) కాసేపు నిలకడగా ఆడాడు. జైస్వాల్‌తో కలిసి 52 పరుగులు జోడించాడు. చివరగా మరో మూడు నిమిషాల్లో తొలిరోజు ఆట ముగుస్తుందనంగా శ్రీకర్ భరత్(17) వెనుదిరిగాడు. దీంతో భారత్ ఆరో వికెట్ కోల్పోయింది. ప్రస్తుతం జైస్వాల్‌ (165), అశ్విన్ (5) క్రీజులో ఉన్నారు.