డబ్లిన్: ఓవైపు ఆసియా కప్.. మరోవైపు వన్డే వరల్డ్ కప్.. మధ్యలో సీనియర్లకు విశ్రాంతి ఇచ్చిన నేపథ్యంలో ఇండియా తర్వాతి తరం ప్లేయర్లు ఇంటర్నేషనల్ ఫ్లాట్‌ఫామ్‌పై సత్తా చాటేందుకు రెడీ అయ్యారు. శుక్రవారం నుంచి జరిగే మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో భాగంగా టీమిండియా.. ఐర్లాండ్‌తో తొలి పోరుకు సిద్ధమైంది. ఇప్పటికే విండీస్ చేతిలో షార్ట్ ఫార్మాట్ సిరీస్ కోల్పోయిన ఇండియాకు ఇప్పుడు ఐపీఎల్ స్టార్లు పెద్ద దిక్కుగా మారారు. ఇందులో రాణించి ఆసియా, వరల్డ్ కప్ టీమ్ రేస్‌లో నిలవాలని వాళ్లంతా టార్గెట్‌గా పెట్టుకున్నారు. అయితే మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది.
11 నెలల తర్వాత
బ్యాక్ ఇంజ్యురీతో దాదాపు 11 నెలల పాటు ఆటకు దూరమైన స్పీడ్‌స్టర్ జస్ప్రీత్ బుమ్రాపైనే ఇప్పుడు అందరి దృష్టి నెలకొంది. కీలకమైన వరల్డ్ కప్‌కు మరో రెండు నెలల టైమ్ మాత్రమే ఉండటంతో అతను ఫామ్‌లోకి రావడం ఇండియాకు అత్యవసరం. ప్రస్తుతానికి నెట్స్‌లో బాగా బౌలింగ్ చేస్తున్న బుమ్రా.. అసలు మ్యాచ్‌లో ఎలా ఆడతాడో చూడాలి. ఐదు రోజుల వ్యవధిలో జరిగే మూడు మ్యాచ్‌ల్లో బుమ్రా గరిష్టంగా 12 ఓవర్లు బౌలింగ్ చేయాల్సి ఉంటుంది. ఇందులో ఎన్ని వికెట్లు తీస్తాడో, ఎన్ని రన్స్ ఇస్తాడో చూడాలి. ప్రస్తుతం టీమిండియా సెలెక్షన్ కమిటీ చీఫ్ అజిత్ అగార్కర్, కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మ.. బుమ్రా రీ ఎంట్రీ కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.
ఈ సిరీస్‌లో అతనికి ఫిట్‌నెస్ ఇబ్బందులు ఎదురుకాకుంటే ఆసియా, వరల్డ్ కప్‌కు లైన్ క్లియర్ అయినట్లే. ఇక సంజూ శాంసన్‌కు ఇది చివరి అవకాశంకాగా రుతురాజ్, రింకూ సింగ్, జితేశ్ శర్మ, ప్రసీధ్ కృష్ణ ఈ సిరీస్‌లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలని భావిస్తున్నారు. శివమ్ దూబేకు కూడా ఇది గొప్ప అవకాశంగా చెప్పొచ్చు. విండీస్‌పై రాణించిన తిలక్ వర్మపై భారీ అంచనాలున్నాయి. అయితే రెండు మెగా ఈవెంట్స్ ముందు కుర్రాళ్లను ఎలా బ్యాలెన్స్ చేస్తారన్న సందేహాలు కూడా మొదలయ్యాయి.
గెలుపే లక్ష్యంగా..
మరోవైపు షార్ట్ ఫార్మాట్‌లో ఐర్లాండ్‌ను ఏమాత్రం తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఆండ్రూ బాల్‌బిర్నీ నేతృత్వంలోని టీమ్‌లో నైపుణ్యం ఉన్న ప్లేయర్లకు కొదవలేదు. హ్యారీ టెక్టర్, లోర్కాన్ టకెర్, లెఫ్టార్మ్ స్పిన్నర్ జార్జ్ డాక్రెల్ చాన్స్ వస్తే కచ్చితంగా విజయాన్ని అందించే సత్తా ఉన్న ప్లేయర్లు. ఐపీఎల్‌లో గుజరాత్‌కు ఆడిన లెఫ్టార్మ్ సీమర్ జోష్ లిటిల్ నుంచి ఇండియాకు ప్రమాదం పొంచి ఉంది. అయితే ఇప్పటి వరకు ఐర్లాండ్.. ఇండియాపై మ్యాచ్ గెలవకపోవడం వాళ్లపై ఒత్తిడి పెంచే అంశం. ఈ సిరీస్‌లో ఎలాగైనా ఇండియాను ఓడించాలన్న ఏకైక టార్గెట్‌తో ఐర్లాండ్ బరిలోకి దిగుతున్నది.