IND vs IRE: ఒత్తిడికి చిత్తయిన ఐర్లాండ్.. రోహిత్ సేన భారీ విజయం

IND vs IRE: ఒత్తిడికి చిత్తయిన ఐర్లాండ్.. రోహిత్ సేన భారీ విజయం

టీ20 ప్రపంచక‌ప్ పోరాటాన్ని టీమిండియా విజయంతో ఆరంభించింది. బుధవారం(జూన్ 05) ఐర్లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్ సేన 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ 96 పరుగులకు కుప్పకూలగా.. స్వల్ప లక్ష్యాన్ని భారత జట్టు 2 వికెట్లు కోల్పోయి 12.2 ఓవర్లలో చేధించింది. కెప్టెన్ రోహిత్ శర్మ(37 బంతుల్లో 52 రిటైర్డ్ హర్ట్; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్ సెంచరీ సాధించాడు.

కోహ్లీ విఫలం

97 పరుగుల ఛేదనలో విరాట్ కోహ్లీ(1) సింగిల్ డిజిట్‌కే వెనుదిరిగాడు. అడైర్‌ వేసిన మూడో ఓవర్‌లో తొలి మూడు బంతులు తడబడిన కోహ్లీ.. నాలుగో బంతికి బెంజమిన్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దాంతో 22 పరుగుల వద్ద టీమిండియా తొలి వికెట్ కోల్పోయింది. అనంతరం క్రీజులోకి వచ్చిన రిషభ్‌ పంత్‌(26 బంతుల్లో 36 నాటౌట్).. రోహిత్ తో జత కలిసి మరో వికెట్ చేజారకుండా నిలకడగా ఆడాడు. అయితే, విజయానికి 20 పరుగుల కావాల్సిన సమయంలో రోహిత్(52) రిటైర్డ్ హర్ట్ గా తప్పుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సూర్య(2) భారీ షాట్ కు యత్నించి డాక్ రెల్ చేతికి చిక్కగా.. పంత్ సిక్స్ తో మ్యాచ్ ముగించాడు. స్లగ్గిష్ పిచ్‌పై ఇరు జట్ల బ్యాటర్లు తడబడ్డారు.

పాండ్యా తీన్ మార్ 

అంతకుముందు భారత బౌలర్లు విజృంభించడంతో ఐర్లాండ్ 96 ప‌రుగుల‌కే కుప్పకూలింది. ఐరిష్ బ్యాటర్లలో గారెత్ డెలానీ(14 బంతుల్లో 26; 2 ఫోర్లు, 2 సిక్స్ లు) మినహా ఏ ఒక్కరూ 20 పరుగులను దాటలేకపోయారు. చేసిన 96 పరుగుల్లోనూ ఎక్సట్రాల రూపంలో వచ్చినవి.. 15. పాల్ స్టిర్లింగ్(2), అండ్రూ బ‌ల్బిరినీ(5), టక్కర్ (10), టెక్టార్ (4), క్యాంఫర్ (12), డాక్రెల్ (3).. ఇలా కీలక బ్యాటర్లంతా చేతులెత్తేశారు. 

ఒక దశలో 50 పరుగులకే ఎనిమిది వికెట్లు కోల్పోయిన ఐరిష్ జట్టు.. 60 పరుగులలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించింది. ఆ సమయంలో డెలానీ (26), జోష్ లిటిల్ (14) దూకుడుగా ఆడి ఆ మాత్రం స్కోరైనా అందించారు. భారత బౌలర్లలో హార్దిక్ పాండ్య 3, అర్ష్‌దీప్ 2, బుమ్రా 2, సిరాజ్, అక్షర్ పటేల్ తలో వికెట్ పడగొట్టారు.