వరల్డ్ కప్ లో టీమిండియా మ్యాచ్ కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న అభిమానులకు ఆ రోజు రానే వచ్చింది. నేడు (జూన్ 5) ఐర్లాండ్ తో తొలి మ్యాచ్ ఆడేందుకు సిద్ధంగా ఉంది. న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నీలో ఇరు జట్లకు ఇదే తొలి మ్యాచ్. అమెరికాలో వాతావరణ పరిస్థితులు ఊహించని విధంగా ఉన్నాయి. అయితే ఈ మ్యాచ్ కు వర్షం పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం.
వరుణుడు కరుణిస్తాడా.. ?
న్యూయార్క్‌లోని వాతావరం పరిస్థితులు ఒక అంచనాకు రావడం లేదు. దీంతో ఈ రోజు మ్యాచ్ కు వర్షం పడుతుందేమోనని అభిమానుల్లో కొత్త టెన్షన్ స్టార్ట్ అయింది. అక్యూవెదర్ ప్రకారం నేడు న్యూయార్క్‌లో జరిగే మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించే అవకాశాలు తక్కువగా కనిపిస్తున్నాయి. USA టైమింగ్ ప్రకారం.. మ్యాచ్ ఉదయం 10:30 గంటలకు జరుగుతుంది. రిపోర్ట్స్ ప్రకారం పగటిపూట వర్షం అంతరాయం ఉండదు. న్యూయార్క్‌లో వాతావరణం 24 డిగ్రీల సెల్సియస్ గా ఉంది. అయితే మధ్యాహ్నం న్యూయార్క్‌లో మబ్బులు కమ్మే అవకాశం ఉందని అంచనా. ఇప్పటివరకు న్యూయార్క్ లో జరిగిన ఏ మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించలేదు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే రోహిత్ శర్మ కెప్టెన్సీలోని భారత క్రికెట్ జట్టు ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. పసికూన ఐర్లాండ్ పై జాగ్రత్తగా ఆడి వరల్డ్ కప్ లో బోణీ కొట్టాలని చూస్తుంది. మరోవైపు సంచలనాలకు మారు పేరైన ఐర్లాండ్ తొలి మ్యాచ్ లో పటిష్టమైన భారత్ కు షాక్ ఇవ్వాలని చూస్తుంది. సాయంత్రం 8 గంటలకు మ్యాచ్ జరుగుతుంది. స్టార్ స్పోర్ట్స్ లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.