India vs Nepal: చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. తొలి ఆట‌గాడిగా..

India vs Nepal: చరిత్ర సృష్టించిన నేపాల్ క్రికెటర్.. తొలి ఆట‌గాడిగా..

ఇండియాతో జరుగుతున్న కీలక మ్యాచ్‌లో నేపాల్ క్రికెట‌ర్ ఆసిఫ్ షేక్ అరుదైన ఘనత సాధించాడు. విధ్వంస‌క ఇన్నింగ్స్‌ల‌కు పేరొందిన‌ ఈ యువ క్రికెటర్.. ఇండియాపై అర్ధ శ‌త‌కం బాదాడు. తద్వారా ఇండియాపై అర్థ శ‌త‌కం బాదిన తొలి నేపాల్ ఆట‌గాడిగా రికార్డుల్లోకెక్కాడు.

88 బంతుల్లో 7 ఫోర్ల‌ సాయంతో ఫిఫ్టీ బాదిన ఈ యువ క్రికెటర్.. ధాటిగా ఆడే క్ర‌మంలో 58 ప‌రుగుల వ‌ద్ద‌ ఔట‌య్యాడు. సిరాజ్ ఓవ‌ర్లో విరాట్ కోహ్లీ క్యాచ్ ప‌ట్ట‌డంతో ఆసిఫ్ ఇన్నింగ్స్‌కు తెర‌ప‌డింది. ఈ మ్యాచ్ లో నేపాల్ బ్యాటర్లు బలమైన ఇండియా బౌలింగ్ లైనప్ ను ధీటుగా ఎదుర్కొంటున్నారు. ఆరంభంలోనే ఇండియన్ ఫీల్డర్లు మూడు క్యాచ్‌లు నేలపాలు చేయడంతో అవకాశాన్ని వాళ్లు సద్వినియోగం చేసుకున్నారు. ఈ ఇద్దరికీ తొలి ఐదు ఓవర్లలోనే మూడు లైఫ్స్ లభించాయి. శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లి, ఇషాన్ కిషన్  వీరి క్యాచ్‌లను డ్రాప్ చేశారు.

ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డు

వికెట్ కీప‌ర్, బ్యాట‌ర్ అయిన ఆసిఫ్ షేక్ 2021లో ప‌పువా న్యూగినియాతో జరిగిన మ్యాచ్ ద్వారా అంతర్జాతీయ అరంగ్రేటం చేశాడు. ఈ ఏడాది అనూహ్యంగా అదే జ‌ట్టుపై వ‌న్డేల్లో మొద‌టి శ‌త‌కం బాదాడు. ఐర్లాండ్‌తో జరిగిన ఒక మ్యాచ్‌లో ఐరిష్ బ్యాటర్ ఆండీ మెక్‌బ్రైన్‌ను రనౌట్ చేయకూడదని తాను తీసుకున్న నిర్ణయం ఐసీసీ అవార్డు తెచ్చి పెట్టింది. ఆసిఫ్.. 2022 ఐసీసీ స్పిరిట్ ఆఫ్ క్రికెట్ అవార్డును గెలుచుకున్నాడు. నేపాల్ జ‌ట్టు ఆసియా క‌ప్ పోటీల‌కు అర్హ‌త సాధించ‌డంలో అతడి పాత్ర ఎంతో ఉంది.