వాంఖడే వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన సెమీ ఫైనల్ పోరులో భారత జట్టు విజయడంఖా మోగించింది. మొదట కోహ్లీ(117), అయ్యర్(105) రాణించడంతో 397 పరుగుల భారీ స్కోర్ చేసిన భారత్.. అనంతరం షమీ విజృంభణతో కివీస్ 327 పరుగులకే కుప్పకూలింది. దీంతో టీమిండియా 70 పరుగుల తేడాతో విజయం సాధించి సగర్వంగా ఫైనల్‌లో అడుగుపెట్టింది.
డారిల్ మిచెల్ సెంచరీ
398 పరుగుల భారీ ఛేదనలో న్యూజిలాండ్ బ్యాటర్లు ధీటుగానే బదులిచ్చారు. డెవాన్ కాన్వే(13), రచిన్ రవీంద్ర(13) త్వరగా పెవిలియన్ చేరినా.. కేన్ విలియమ్సన్(69), డారిల్ మిచెల్(134) జోడి కాసేపు భారత బౌలర్లను ఇబ్బందిపెట్టారు. వీరిద్దరూ ఏకంగా మూడో వికెట్‌కు 181 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ సమయంలో భారత పేసర్ మహమ్మద్ షమీ కివీస్‌ను దెబ్బకొట్టాడు. ఒకే ఓవర్‌లో కేన్ విలియమ్సన్ (69), టామ్ లాథమ్ (0)ను ఔట్ చేసి మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. ఆపై డారిల్ మిచెల్ పోరాడినా.. అతనికి మరో ఎండ్ నుంచి సహకారం లేకపోయింది.
దానికి తోడు పరుగులు రావడం కష్టంగా మారడం, రిక్వైర్డ్ రన్ రేట్ అంతకంతకూ పెరిగిపోవడంతో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ గాడి తప్పింది. చివరలో గ్లెన్ ఫిలిప్స్ (41) పర్వాలేదనిపించాడు. దీంతో కివీస్ 48.5 ఓవర్లలో 327 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. భారత బౌలర్లలో షమీ ఏడు వికెట్లు తీసుకోగా.. బుమ్రా, సిరాజ్, కుల్దీప్ యాదవ్ తలో వికెట్ పడగొట్టారు.
కోహ్లీ, అయ్యర్ శతకాలు
అంతకుముందు టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ చేపట్టిన భారత్.. కివీస్ ఎదుట కొండంత లక్ష్యాన్ని నిర్ధేశించింది. విరాట్ కోహ్లీ (117; 113 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు), శ్రేయస్ అయ్యర్ (105; 70 బంతుల్లో 4 ఫోర్లు, 8 సిక్సర్లు) సెంచరీలు చేయగా.. రోహిత్ శర్మ (47), శుభ్‌మన్ గిల్ (80 నాటౌట్), కేఎల్ రాహుల్(39) మెరుపులు మెరిపించారు. దీంతో భారత జట్టు నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 397 పరుగుల భారీ స్కోరు చేసింది.
??? ???? ??????! ?#TeamIndia ?? march into the FINAL of #CWC23 ?#MenInBlue | #INDvNZ pic.twitter.com/OV1Omv4JjI
— BCCI (@BCCI) November 15, 2023