- కోహ్లీ, సర్ఫరాజ్, రోహిత్ హాఫ్ సెంచరీలు
- తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్ 402 ఆలౌట్
- సెంచరీతో చెలరేగిన రచిన్ రవీంద్ర
బెంగళూరు : న్యూజిలాండ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఇండియా కాస్త కోలుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో పెవిలియన్‌కు క్యూ కట్టిన టీమిండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో గట్టిగానే పోరాడారు. విరాట్ కోహ్లీ (70), సర్ఫరాజ్ ఖాన్ (70 బ్యాటింగ్), రోహిత్ శర్మ (52) హాఫ్ సెంచరీలు చేయడంతో.. శుక్రవారం మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా సెకండ్ ఇన్నింగ్స్‌లో 49 ఓవర్లలో 231/3 స్కోరు చేసింది. యశస్వి జైస్వాల్ (35) ఫర్వాలేదనిపించాడు.
అంతకుముందు 180/3 ఓవర్‌నైట్ స్కోరుతో మూడో రోజు ఆట కొనసాగించిన న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్‌లో 91.3 ఓవర్లలో 402 రన్స్‌కు ఆలౌటైంది. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 356 రన్స్ ఆధిక్యంలో నిలిచింది. రచిన్ రవీంద్ర (134) సెంచరీతో చెలరేగగా, టిమ్ సౌతీ (65) ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం ఇండియా ఇంకా 125 రన్స్ వెనకబడి ఉంది. రెండు రోజుల ఆట మిగిలి ఉంది.
రచిన్ సూపర్..
రెండో రోజు తేలిపోయిన ఇండియా బౌలర్లు మూడో రోజు గాడిలో పడ్డారు. ఆరంభంలోనే సిరాజ్ (2/84) దెబ్బకు ఓవర్‌నైట్ బ్యాటర్ డారిల్ మిచెల్ (18) గల్లీలో జైస్వాల్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో మూడు ఓవర్ల తర్వాత టామ్ బ్లండెల్ (5)ను బుమ్రా (1/41) బోల్తా కొట్టించాడు. 11 రన్స్ తేడాలో ఈ ఇద్దరు ఔటైనా, ఓ ఎండ్‌లో రచిన్ రవీంద్ర క్రీజులో పాతుకుపోయాడు. ఈ దశలో బౌలింగ్‌కు దిగిన జడేజా (3/72) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. తన వరుస ఓవర్లలో గ్లెన్ ఫిలిప్స్ (14), మ్యాట్ హెన్రీ (8)ని పెవిలియన్‌కు పంపడంతో కివీస్ స్కోరు 233/7గా మారింది.
అప్పటికే 187 రన్స్ లీడ్‌లో ఉన్న కివీస్ ఇన్నింగ్స్‌కు తొందరగా అడ్డుకట్ట వేయాలని ప్రయత్నించినా సౌతీ, రచిన్ సూపర్ ఇన్నింగ్స్‌తో మళ్లీ నిలబెట్టారు. మంచి ఫుట్ వర్క్‌తో రచిన్ స్పిన్నర్లను దీటుగా ఎదుర్కోగా, సౌతీ తన ట్రేడ్ మార్క్ ఫోర్లు, సిక్స్‌లతో అలరించాడు. ఈ క్రమంలో అశ్విన్ (1/94) బౌలింగ్‌లో స్వీప్ షాట్‌తో ఫోర్‌తో కెరీర్‌లో రెండో సెంచరీ పూర్తి చేశాడు. ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 134 రన్స్ జోడించారు. లంచ్ తర్వాత వరుస విరామాల్లో సౌతీని సిరాజ్, అజాజ్ పటేల్ (4), రచిన్‌ను కుల్దీప్ (3/99) ఔట్ చేయడంతో కివీస్ ఇన్నింగ్స్‌కు తెరపడింది.
కీలక భాగస్వామ్యం..
తొలి ఇన్నింగ్స్‌లో నిరాశపరిచిన ఇండియా బ్యాటర్లు రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడారు. స్టార్టింగ్ నుంచే జైస్వాల్, రోహిత్ బౌండ్రీలతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. పిచ్ నుంచి పెద్దగా సహకారం లేకపోయినా మంచి ఫుట్‌వర్క్‌తో పేసర్లను దీటుగా ఎదుర్కొన్నారు. అయితే క్రీజులో పాతుకుపోయిన ఈ జోడీని అజాజ్ పటేల్ (2/70) మూడు ఓవర్ల తేడాలో విడదీశాడు. దీంతో తొలి వికెట్‌కు 72 రన్స్ పార్ట్‌నర్‌షిప్ ముగిసింది.
ఈ దశలో కోహ్లీ, సర్ఫరాజ్ కీలక ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నారు. కుదురుకోవడానికి కాస్త టైమ్ తీసుకున్నా ఆ తర్వాత ఫోర్ల వర్షం కురిపించారు. ఈ ఇద్దరు పోటీపడి రన్స్ రాబట్టి మూడో వికెట్‌కు 136 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టారు. కానీ దురదృష్టవశాత్తు డే లాస్ట్ బాల్‌కు ఫిలిప్స్ (1/36) బౌలింగ్‌లో కోహ్లీ కీపర్‌కు క్యాచ్ ఇచ్చిన వెనుదిరిగాడు.
4 టెస్ట్‌ల్లో 9 వేల రన్స్ పూర్తి చేసిన నాలుగో ఇండియన్ క్రికెటర్ విరాట్ కోహ్లీ(9017). సచిన్ (15,921), ద్రవిడ్ (13,265), సునీల్ గావస్కర్ (10,122) ముందున్నారు. ఓవరాల్‌గా విరాట్ 18వ ప్లేయర్‌గా రికార్డులకెక్కాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్ : 46 ఆలౌట్. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ : 91.3 ఓవర్లలో 402 ఆలౌట్ (రచిన్ రవీంద్ర 134, సౌతీ 65, కుల్దీప్ 3/99, జడేజా 3/72). ఇండియా రెండో ఇన్నింగ్స్ : 49 ఓవర్లలో 231/3 (కోహ్లీ 70, సర్ఫరాజ్ 70*, రోహిత్ 52, అజాజ్ పటేల్ 2/70).