- విరాట్ కోహ్లీపై ఫోకస్
- మ్యాచ్‌కు వాన ముప్పు
- ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో లైవ్
బెంగళూరు: కొత్త కోచ్ గౌతమ్ గంభీర్ రాగానే తన ఆటతీరును మార్చుకొని దూకుడు చూపెడుతున్న టీమిండియా సొంతగడ్డపై మరో టెస్టు సిరీస్‌కు రెడీ అయింది. టీ20 స్టయిల్లో దంచికొడుతూ బంగ్లాదేశ్‌తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసిన రోహిత్‌సేన ఇప్పుడు బలమైన న్యూజిలాండ్‌తో సవాల్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య మూడు టెస్టుల సిరీస్‌లో భాగంగా తొలి మ్యాచ్ ఇక్కడి చిన్నస్వామి స్టేడియంలో బుధవారం మొదలవనుంది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) సైకిల్‌లో ఇండియా స్వదేశంలో ఆడే చివరి సిరీస్ ఇదే. దీని తర్వా త ఆస్ట్రేలియాలో కఠినమైన బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో పోటీపడనుంది. కివీస్‌తో సిరీస్‌లో సత్తా చాటి తే డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో టాప్ ప్లేస్‌ను మరింత పది లం చేసుకొని ఫైనల్ బెర్తును ఖరారు చేసుకునే అవకాశాన్ని వదులుకోకూడదని రోహిత్‌సేన భావిస్తోంది.
కోహ్లీ, రోహిత్ దంచాలె
అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఇండియా ఈ మ్యాచ్‌లో ఫేవరెట్‌గా బరిలోకి దిగనుంది. సూపర్ ఫామ్‌లో ఉన్న యంగ్‌స్టర్స్ యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్ ఇండియా నయా హీరోలుగా మారారు. బంగ్లాదేశ్‌పై మూడు ఫిఫ్టీలతో మెరిసిన జైస్వాల్ జట్టు అవసరాలకు తగ్గట్టుగా ఆడుతున్నాడు. మరోవైపు తప్పిదాల నుంచి వెంటనే పాఠాలు నేర్చుకుంటున్న గిల్ అత్యంత నిలకడ చూపెడుతున్నాడు. ఈ ఏడాది ఆరంభంలో ఇంగ్లండ్‌తో సిరీస్‌లో ఇబ్బందిపడిన అతను గత పది ఇన్నింగ్స్‌ల్లో మూడు సెంచరీలు, రెండు ఫిఫ్టీలు సాధించాడు. వీళ్లు ఇదే ఫామ్ కొనసాగించాలని మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. అయితే, మెడ నొప్పితో ఇబ్బందిపడుతున్న గిల్ ఫిట్‌గా లేకుంటే అతని స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ తుది జట్టులోకి రానున్నాడు. అప్పుడు కేఎల్ రాహుల్ మూడో నంబర్‌లో ఆడే చాన్సుంది. ఇక, కెరీర్ చివర్లో ఉన్న కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ జోరు పెంచి, నిలకడగా రాణించాల్సిన అవసరం ఉంది.
ఈ ఏడాది 15 ఇన్నింగ్స్‌లు ఆడి రెండు సెంచరీలు కొట్టిన రోహిత్ మిగతా 13 ఇన్నింగ్స్‌ల్లో ఒకే ఫిఫ్టీ చేయగలిగాడు. మొత్తంగా ఎనిమిది టెస్టుల్లో 497 రన్స్ చేశాడు. ఇక, టెస్టుల్లో 9 వేల రన్స్ మైలురాయికి 53 రన్స్ దూరంలో ఉన్న విరాట్ ఈ ఏడాది ఆరు ఇన్నింగ్స్‌ల్లో ఒక్క హాఫ్ సెంచరీ కూడా చేయలేకపోయాడు. తన ఫామ్‌పై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కివీస్‌పై రోహిత్, కోహ్లీ ఇద్దరూ దంచికొట్టి ఫామ్ అందుకోవాలి. టెస్టు రీఎంట్రీలో సెంచరీతో మెరిసిన రిషబ్ పంత్‌తో పాటు ఆల్‌రౌండర్లు అశ్విన్, జడేజా ఫామ్‌లో ఉండటం జట్టు బలాన్ని పెంచుతోంది. పేస్ బాధ్యతలు బుమ్రా, సిరాజ్ అందుకోనుండగా పిచ్, వాతావరణం దృష్ట్యా మూడో పేసర్‌గా ఆకాశ్ దీప్ లేదంటే మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ యాదవ్ తుది జట్టులో ఉంటాడు.
ఒత్తిడిలో న్యూజిలాండ్
గత రెండు సిరీస్‌ల్లో ఆస్ట్రేలియా, శ్రీలంక చేతిలో వైట్‌వాష్‌కు గురైన న్యూజిలాండ్ ఒత్తిడిలో ఉంది. డబ్ల్యూటీసీ పట్టికలో ఆరో స్థానంలో ఉన్న బ్లాక్‌క్యాప్స్ టీమ్‌కు ఈ సిరీస్ చావోరేవో కానుంది. గత నెలలో గ్రేటర్ నోయిడాలో అఫ్గానిస్తాన్‌తో ఏకైక టెస్టు వర్షం కారణంగా పూర్తిగా రద్దవడంతో సరైన ప్రాక్టీస్ లేకుండా కివీస్ బరిలోకి దిగుతోంది. పైగా, గజ్జల్లో గాయం నుంచి పూర్తిగా కోలుకోని టాప్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ తొలి టెస్టుకు అందుబాటులో లేకపోవడం ఆ జట్టుకు మరింత ప్రతికూలాంశం. మోకాలి గాయంతో పేసర్ బెన్ సియర్స్ సిరీస్ మొత్తానికి దూరమయ్యాడు. అతని ప్లేస్‌లో జాకబ్ డఫీ జట్టులోకి వచ్చాడు. గత సిరీస్‌లో శ్రీలంక స్పిన్నర్ల ముందు తేలిపోయిన లాథమ్ కెప్టెన్సీలోని కివీస్ బ్యాటర్లు.. ఇండియా టాప్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాను ఏమేరకు ఎదుర్కొంటారన్నది కీలకం. వర్ష సూచన, చల్లటి వాతావరణంలో టిమ్ సౌథీ నేతృత్వంలోని తమ పేసర్లు సత్తా చాటుతారని కివీస్ ఆశిస్తోంది.
పిచ్/వాతావరణం
ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో ఈ స్టేడియం పిచ్ సీమర్లకు అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. మ్యాచ్ జరిగే రోజుల్లో వర్ష సూచన ఉంది. తొలి రెండు రోజుల్లో ఎక్కువ వర్షం కురిసే అవకాశం కనిపిస్తోంది. అయితే, ఈ స్టేడియంలో మోడ్రన్ డ్రైనేజ్ సిస్టం ఉంది.
తుది జట్లు (అంచనా)
ఇండియా: రోహిత్ (కెప్టెన్), జైస్వాల్, గిల్/సర్ఫరాజ్, కోహ్లీ, పంత్ (వికెట్), రాహుల్, జడేజా, అశ్విన్, ఆకాశ్ దీప్/కుల్దీప్ యాదవ్, బుమ్రా, సిరాజ్.
న్యూజిలాండ్: డెవాన్ కాన్వే, టామ్ లాథమ్ (కెప్టెన్), విల్ యంగ్, రచిన్ రవీంద్ర, డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ (కీపర్), గ్లెన్ ఫిలిప్స్, మిచెల్ శాంట్నర్/మైఖేల్ బ్రేస్‌వెల్, టిమ్ సౌథీ, అజాజ్ పటేల్, విల్ ఒరూర్కే.