స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్ట్ సిరీస్‌ను టీమిండియా ఓటమితో ప్రారంభించింది. ఈ ఇరు జట్ల మధ్య బెంగళూరు వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో టీమిండియా 8 వికెట్ల తేడాతో ఓటమి పాలైంది. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలిన రోహిత్ సేన.. రెండో ఇన్నింగ్స్‌లో 462 పరుగులతో పర్వాలేదనిపించినప్పటికీ ఓటమి నుంచి గట్టెక్కలేకపోయింది. భారత్ నిర్ధేశించిన 107 పరుగుల లక్ష్యాన్ని కివీస్ కేవలం 2 వికెట్లు కోల్పోయి చేధించింది. ఓపెనర్లు లథమ్ (0), కాన్వే (17) త్వరగా ఔటైనప్పటికీ.. విల్ యంగ్ (48*), రచిన్ రవీంద్ర (39*) జోడి మరో వికెట్ పడనీయకుండా జట్టును విజయతీరాలకు చేర్చారు.
తొలి ఓవర్‌లోనే వికెట్
ఆఖరి రోజు ఆట ప్రారంభమైన తొలి ఓవర్‌లోనే టీమిండియాకు వికెట్ దక్కింది. బుమ్రా ఓ చక్కని బంతితో తొలి ఓవర్‌లోనే కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్‌ను బురిడీ కొట్టించాడు. దాంతో, ఓ అరగంట పాటు మ్యాచ్ హోరాహోరీగా సాగింది. లక్ష్యం చిన్నది కావడం.. కివీస్ బ్యాటర్లు డిఫెన్స్‌కు ప్రాధాన్యమివ్వడంతో.. భారత బౌలర్లు ఎంత ప్రయత్నించినా వికెట్ల వేటలో పైచేయి సాధించలేకపోయారు. తొలి ఇన్నింగ్స్‌లో 46 పరుగులకే కుప్పకూలడం.. బుమ్రా మినహా ఇతర బౌలర్లు రాణించకపోవడం భారత్‌ను దెబ్బతీసింది.
సంక్షిప్త స్కోర్లు
- ఇండియా తొలి ఇన్నింగ్స్: 46/10
- న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్: 402/10 (రచన్ రవీంద్ర- 134, కాన్వే - 91)
- ఇండియా రెండో ఇన్నింగ్స్: 462/10 (సర్ఫరాజ్ ఖాన్- 150, రిషబ్ పంత్- 99)
- న్యూజిలాండ్ రెండో ఇన్నింగ్స్: 107/2 (విల్ యంగ్- 45 నాటౌట్, రచిన్ రవీంద్ర- 38 నాటౌట్)
ఈ ఇరు జట్ల మధ్య అక్టోబర్ 24 నుంచి పూణె వేదికగా రెండో టెస్ట్ ప్రారంభం కానుంది.