- తొలి మ్యాచ్ ఓటమికి బదులే లక్ష్యంగా బరిలోకి
- ఉ. 9.30 నుంచి స్పోర్ట్స్18, జియో సినిమాలో లైవ్
పుణె : తొలి మ్యాచ్‌లో న్యూజిలాండ్ చేతిలో అనూహ్య ఓటమితో కంగుతిన్న టీమిండియా ఆ పరాజయానికి ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమైంది. పుణెలోని ఎంసీఏ స్టేడియంలో గురువారం మొదలయ్యే రెండో టెస్టులో గెలిచి లెక్క సరి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లోనూ ఓడితే స్వదేశంలో వరుసగా 18 టెస్టు సిరీస్‌ల విజయ యాత్రకు బ్రేక్‌పడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో ఏ చిన్న తప్పిదానికి కూడా తావివ్వకుండా కివీస్ రెక్కలు విరిచేయాలని చూస్తోంది.
బెంగళూరులో రోహిత్‌సేన తొలి ఇన్నింగ్స్‌లో 46 రన్స్‌కే కుప్పకూలి రెండో ఇన్నింగ్స్‌లో అద్భుత పోరాట పటిమ చూపెట్టినా 8 వికెట్ల తేడాతో ఓడిపోయింది. వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్‌లో ఇండియా టాప్ ప్లేస్‌లో కొనసాగుతున్నప్పటికీ పాయింట్లు కోల్పోయింది. వచ్చే నెలలో ఆస్ట్రేలియాలో 5 టెస్టుల సిరీస్ ఆడనున్న రోహిత్‌సేన కివీస్‌తో మిగిలిన రెండు టెస్టుల్లోనూ గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది.
చిన్నస్వామి స్టేడియంలో చల్లటి వాతావరణంలో పేసర్లకు అనుకూలించిన పిచ్‌పై బోల్తా కొట్టిన నేపథ్యంలో పుణెలో స్పిన్‌కు అనుకూలించే స్లో, టర్నింగ్ వికెట్ సిద్ధమైంది. స్వదేశంలో తమ ప్రధాన అస్త్రమైన స్పిన్‌తో బ్లాక్‌క్యాప్స్ జట్టును తిప్పేయాలని రోహిత్‌సేన భావిస్తోంది. అయితే, ఇలాంటి స్పిన్ వికెట్లపై గతంలో రెండుసార్లు మన జట్టే బోల్తా కొట్టిన నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది.
గిల్ రెడీ..రాహుల్‌తో సర్ఫరాజ్ పోటీ!
ఈ మ్యాచ్‌లో ఇండియా పలు మార్పులతో బరిలోకి దిగనుంది. గాయం కారణంగా తొలి టెస్టుకు దూరమైన యంగ్‌స్టర్ శుభ్‌మన్ గిల్ పూర్తి ఫిట్నెస్ సాధించాడు. తను వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు రానున్నాడు. తన కోసం కేఎల్ రాహుల్, సర్ఫరాజ్‌లో ఒకరు బెంచ్‌కు పరిమితం అవ్వాల్సి ఉంటుంది. బెంగళూరులో రాహుల్ రెండు ఇన్నింగ్స్‌ల్లో ఫెయిలవగా.. సర్ఫరాజ్ భారీ సెంచరీతో ఆకట్టుకున్నాడు. రాహుల్‌కు కోచ్ గంభీర్ బాసటగా నిలిచిన నేపథ్యంలో ఎవరిని కొనసాగిస్తారన్నది ఆసక్తిగా మారింది. గత మ్యాచ్‌లో నిరాశపరిచిన ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఈసారి బాధ్యతగా ఆడాలి.
సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ భారీ స్కోరు చేయాల్సిన అవసరం ఉంది. మోకాలి గాయం నుంచి పూర్తిగా కోలుకున్న రిషబ్ పంత్ కీపింగ్ చేస్తాడని గంభీర్ చెప్పాడు. కొత్త బంతితో వికెట్ల తీసే బాధ్యతను స్టార్ పేసర్ బుమ్రా తీసుకోనున్నాడు. అయితే, స్వదేశంలో టెస్టుల్లో నిరాశపరుస్తున్న పేసర్ సిరాజ్ ప్లేస్‌లో ఆకాశ్ దీప్‌ను తుది జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది. అశ్విన్, జడేజాకు తోడు మూడో స్పిన్నర్‌గా కుల్దీప్ను కొనసాగిస్తారా? లేక బ్యాటింగ్ కూడా చేసే సత్తా ఉన్న స్పిన్ ఆల్‌రౌండర్ సుందర్‌ను తుది జట్టులోకి తీసుకుంటారా? అన్నది ఆసక్తికరంగా మారింది.
సిరీస్‌పై కివీస్ గురి
పెద్దగా అంచనాలు లేకుండా బరిలోకి దిగి 36 ఏండ్ల తర్వాత ఇండియా గడ్డపై టెస్టు మ్యాచ్ గెలిచిన కివీస్ అదే ఉత్సాహంతో సిరీస్ కూడా నెగ్గాలని ఆశిస్తోంది. గాయం నుంచి కోలుకోని ఆ టీమ్ సీనియర్ బ్యాటర్ కేన్ విలియమ్సన్ ఈ మ్యాచ్‌కు కూడా దూరమయ్యాడు. కానీ, కుర్రాళ్లు విల్ యంగ్, రచిన్ రవీంద్ర మిడిలార్డర్లో అద్భుతంగా ఆడటం కివీస్ ఆత్మవిశ్వాన్ని పెంచింది. అయితే, కెప్టెన్ లాథమ్‌తో పాటు డారిల్ మిచెల్, టామ్ బ్లండెల్ నుంచి జట్టు మంచి పెర్ఫామెన్స్ ఆశిస్తోంది. పుణెలో ఆ టీమ్ స్పిన్నర్ ఎజాజ్ పటేల్ కీలకం కానున్నాడు. పిచ్ దృష్ట్యా సీనియర్ స్పిన్నర్ శాంట్నర్ తుది జట్టులోకి వచ్చే చాన్సుంది.
పిచ్/వాతావరణం
ఈ టెస్టు కోసం నల్ల మట్టితో కూడిన పిచ్ సిద్ధం చేశారు. వికెట్‌పై ఎలాంటి పచ్చిక లేదు. ఈ స్లో, టర్నింగ్ పిచ్‌పై ఆట సాగుతున్న కొద్దీ స్పిన్నర్లు ప్రభావం చూపుతారు. మ్యాచ్ జరిగే ఐదు రోజుల్లో వాతావరణం పొడిగా ఉండనుంది. వర్ష సూచన లేదు.
తుది జట్లు (అంచనా)
ఇండియా : జైస్వాల్, రోహిత్ (కెప్టెన్), గిల్, కోహ్లీ, పంత్ (కీపర్), రాహుల్/సర్ఫరాజ్, జడేజా, అశ్విన్, కుల్దీప్/సుందర్, బుమ్రా , సిరాజ్/ఆకాష్ దీప్.
న్యూజిలాండ్ : లాథమ్ (కెప్టెన్), కాన్వే, యంగ్, రచిన్, డారిల్ మిచెల్, బ్లండెల్ (కీపర్), ఫిలిప్స్, శాంట్నర్, సౌథీ/ఒరూర్క్, హెన్రీ, ఎజాజ్.