IND vs NZ 2nd Test: మళ్లీ అదే తడబాటు.. పూణే టెస్టులో ఓటమి దిశగా టీమిండియా

'ఎవడు తీసుకున్న గోతిలో వాడే పడినట్లు' ఉంది టీమిండియా పరిస్థితి. స్వదేశంలో ప్రత్యర్థి జట్లను స్పిన్‌తో దెబ్బ తీయొచ్చన్న భారత జట్టు వ్యూహం బెడిసి కొడుతోంది. బౌలింగ్‌లో ఇరు జట్ల స్పిన్నర్లు రాణిస్తున్నా.. బ్యాటింగ్‌లో ఆతిథ్య బ్యాటర్లు చేతులెత్తేస్తున్నారు. తొలి టెస్టులో ఓటమిపాలైన రోహిత్ సేన.. తదుపరి రెండు మ్యాచుల్లోనైనా గాడిలో పడుతుందకుంటే, అంతా రివర్స్ జరుగుతోంది. పూణే టెస్టులోనూ భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తోంది. 

జైస్వాల్ ఒక్కడే..

359 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియాకు మంచి ఆరంభమే లభించింది. కెప్టెన్ రోహిత్ శర్మ (8) నిరాశపరిచినా.. మరో ఎండ్‌లో  యశస్వి జైస్వాల్ (77; 65 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్‌లు) భాధ్యుతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. వేగంగా పరుగులు రాబడుతూ విజయంపై ఆశలు రేకెత్తించాడు. అలాంటి సమయంలో శుబ్‌మన్ గిల్(23) మ్యాచ్ పతనానికి దారి చూపాడు. సాంట్నర్ బౌలింగ్‌లో డారిల్ మిచెల్ కు వికెట్ ఇచ్చి పెవిలియన్ బాట పట్టాడు. అక్కడినుంచి టీమిండియా వరుస విరామాల్లో వికెట్లు కోల్పోతూనే ఉంది. 

ALSO READ | PAK vs ENG 2024: కంబ్యాక్ అంటే ఇది: ఇంగ్లాండ్‌ను చిత్తు చేసి టెస్ట్ సిరీస్ గెలిచిన పాకిస్థాన్

రిషబ్ పంత్(0) రనౌట్ రూపంలో వెనుదిరగ్గా.. విరాట్ కోహ్లీ(17), సర్ఫరాజ్ ఖాన్(9), వాషింగ్టన్ సుందర్(21).. ఇలా ఏ ఒక్కరూ జట్టును ఆదుకునే ప్రయత్నం చేయలేదు. దీంతో పూణే టెస్టులో టీమిండియా ఓటమి అంచున నిలిచింది. మూడో రోజు టీ విరామ సమయానికి 7 వికెట్ల నష్టానికి 178 పరుగులు చేసింది. క్రీజులో అశ్విన్, జడేజా ఉన్నారు. భారత్‌ విజయానికి ఇంకా 281 పరుగులు అవసరం. చేతిలో 3 వికెట్లు మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఆట ముగిసేలోపు ఫలితం రావొచ్చు. 

కాగా, తొలి ఇన్నింగ్స్‌లో న్యూజిలాండ్‌ 259 పరుగులు చేయగా.. భారత్ 155 పరుగులకు ఆలౌటైంది. అనంతరం రెండో ఇన్నింగ్స్‌లో కివీస్ జట్టు 255 పరుగులు చేసింది.