భారత్ వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్ మహా సంగ్రామం తుది దశకు చేరుకుంది. ఇప్పటికే లీగ్ దశ మ్యాచ్‌లు ముగియగా.. రేపటి నుంచి సెమీఫైనల్ పోరు మొదలుకానుంది. నవంబర్ 15న వాంఖడే వేదికగా తొలి సెమీఫైనల్ (ఇండియా vs న్యూజిలాండ్) జరగనుండగా, నవంబర్ 16న ఈడెన్ గార్డెన్స్ వేదికగా రెండో సెమీఫైనల్ (ఆస్ట్రేలియా vs దక్షిణాఫ్రికా) జరగనుంది. ఇదిలావుంటే, తొలి సెమీఫైనల్ పోరులో ఇండియా గెలవబోతోందంటూ ప్రముఖ ఆస్ట్రాలజర్ సుమిత్ బజాజ్ జ్యోతిష్యం చెప్పారు.
ఈ మ్యాచ్‌లో టీమిండియా పెద్దగా శ్రమించకుండానే విజయం సాధిస్తుందన్న సుమిత్ బజాజ్.. ఈ గెలుపుతో 2019 వన్డే ప్రపంచ కప్ సెమీఫైనల్ ఓటమికి బదులు తీర్చుకుంటారని తెలిపారు. కాకపోతే న్యూజిలాండ్ జట్టు నుంచి కొన్నిసార్లు సవాళ్లు ఎదురవుతాయని చెప్పారు. అలాగే, ఈ మ్యాచ్‌లో ఎవరెవరు కీలకపాత్ర పోషించబోతున్నారో కూడా అంచనా వేశారు.
టీమిండియానే ఫేవరెట్
ముంబై వేదికగా భారత్ సెమీఫైనల్ ఆడుతుందన్న తన అంచనా నిజమైందని, అహ్మదాబాద్‌లో రోహిత్ సేన ఫైనల్ ఆడుతుందని సుమిత్ బజాజ్ తెలిపారు. ఈ మ్యాచ్‌లో భారత కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకుంటారని చెప్పిన ఆయన.. న్యూజిలాండ్ 250-270 పరుగులు చేయవచ్చని అంచనా వేశారు. దానిని భారత బ్యాటర్లు 47 లేదా 48వ ఓవర్లలోపే చేధిస్తారని వెల్లడించారు.
గిల్, రోహిత్, కోహ్లీ
ఈ మ్యాచ్‌లో భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్‌తో పాటు వన్ డౌన్ బ్యాటర్ విరాట్ కోహ్లి కీలకపాత్ర పోషించబోతున్నారని సుమిత్ బజాజ్ తెలిపారు. "ఈ మ్యాచ్‌లో విరాట్ కోహ్లి, గిల్, రోహిత్ కీలక పాత్ర పోషిస్తారు. కెప్టెన్ జాతకం చాలా ముఖ్యమైనది. జట్టు ప్రదర్శనలో రోహిత్ తన పాత్ర పోషిస్తాడు. ఫైనల్లోనూ టీమ్‌ను గెలిపిస్తాడు. రోహిత్ వయసు 37 ఏళ్లు. ఖచ్చితంగా చెప్పాలంటే 36.5 ఏళ్లు. ఈ సమయం భారత జట్టును విజేతగా నిలపడానికి రోహిత్ శర్మకు చాలా అనుకూలంగా ఉంది. విరాట్ కోహ్లీ ప్రస్తుతం పీక్‌లో ఉన్నాడు.." అని సుమిత్ బజాజ్ జోస్యం చెప్పారు.
రచిన్ రవీంద్ర విఫలం
భారత్‌తో జరిగే సెమీఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ యువ ఆల్ రౌండర్ రచిన్ రవీంద్ర రాణించకపోవచ్చని సుమిత్ బజాజ్ అభిప్రాయపడ్డారు. ఈ టోర్నీలో రచిన్ రవీంద్ర 9 మ్యాచ్‌ల్లో 565 పరుగులు చేశాడు. ఇందులో 3 సెంచరీలు, 2 అర్ధసెంచరీలు ఉన్నాయి.
"న్యూజిలాండ్ జట్టు విషయానికి వస్తే, మిచెల్ సాంట్నర్, డెవాన్ కాన్వే వంటి కొందరు ఆటగాళ్లను గమనించాలి. రాచిన్ రాణించకపోవచ్చు.. అతడు త్వరగానే వికెట్ కోల్పోతాడు.." అని బజాజ్ వెల్లడించారు.