
ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కి ఎంత క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఇండియా న్యూజిలాండ్ మధ్య జరుగుతోన్న ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ పై ప్రపంచవ్యాప్తంగా జోరుగా బెట్టింగ్స్ జరుగుతోంది. దాదాపు రూ. 5 వేల కోట్లు చేతులు మారబోతున్నట్లు సమాచారం. దుబాయ్ వేదికగా బుకీలు ఈ బెట్టింగ్ ను నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బెట్టింగ్ మాఫియా వెనుక దావూద్ డీ కంపెనీ ఉన్నట్లు సమాచారం.
మార్చి 8న ఢిల్లీలో ఐదుగురు బుకీలను అరెస్ట్ చేశారు పోలీసులు. వీళ్ల దగ్గర నుంచి రూ. 22 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ బెట్టింగ్ ముఠా సెమీ ఫైనల్ మ్యాచ్ కోసం బెట్టింగ్ చేశారని ఆధారాలు లభించడంతో వీళ్లను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.
బ్యాటింగ్ లో తిరుగులేదు..బౌలింగ్ లో ఎదురులేదు
వరుసగా నాలుగు మ్యాచ్‌లు. అన్నింటిలోనూ ఏకపక్ష విజయాలు. బ్యాటింగ్‌లో తిరుగులేదు.. బౌలింగ్‌లో ఎదురులేదు. ఇదే జోరుతో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా పట్టుదలగా బరిలోకి దిగుతోంది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో బ్లాక్‌క్యాప్స్ జట్టును ఓడించినప్పటికీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు.
ఆస్ట్రేలియా మాదిరిగా ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ ఎప్పుడూ ఇండియాకు కఠిన ప్రత్యర్థే. ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుతో ముఖాముఖీ మ్యాచ్‌ల్లో ఆ టీమ్ 10–6తో ఆధిక్యంలో ఉంది. నాకౌట్ రౌండ్లలో ఇరు జట్లూ నాలుగు సార్లు తలపడితే కివీస్ మూడుసార్లు నెగ్గి 3–1తో ముందంజలో నిలిచింది. ఇందులో 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి మన టీమ్‌ను చాలా కాలం వెంటాడింది. దాంతో పాటi2021 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ కివీస్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు రోహిత్‌సేన ముందుంది.