వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా ఆదివారం ధర్మశాల వేదికగా ఇండియా- న్యూజిలాండ్ తలపడనున్నాయి. ఇప్పటికే ఇరు జట్లు అక్కడికీ చేరుకోగా.. మ్యాచ్ ప్రారంభం కావడానికి మరికొన్ని గంటలు మాత్రమే మిగిలిపోయింది. ఈ సమయంలో నకిలీ టికెట్లు కలకలం రేపుతున్నాయి.
భారత్-న్యూజిలాండ్ మ్యాచ్ టికెట్లు అమ్ముతున్న ఓ వ్యక్తిని హిమాచల్ ప్రదేశ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. స్టేడియం సమీపంలోనే అతన్ని పట్టుకున్నట్లు అడిషనల్ పోలీస్ సూపరింటెండెంట్ హితేష్ లఖన్‌పాల్ తెలిపారు. సదరు వ్యక్తిని హైదరాబాద్‌కు చెందినవాడిగా గుర్తించిన పోలీసులు.. అతని నుంచి రెండు మొబైల్ ఫోన్లు, పలు టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. అయితే సదరు వ్యక్తి ఎవరు..? ఏంటి..? అన్న వివరాలు తెలియరాలేదు.
చరిత్ర మారుతుందా?
భారత జట్టు.. న్యూజిలాండ్‌పై విజయం సాధించి 20 ఏళ్లవుతోంది. చివరిసారిగా 2003 వన్డే ప్రపంచ కప్ లో విజయం మినహా.. ఆ తర్వాత ఇప్పటిదాకా గెలుపు రుచి చూడలేదు. 2007, 2016, 2021 టీ20 వరల్డ్ కప్‌లో పరాజయాలే. ఆపై 2019 లో జరిగిన వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్లోనూ ఓటమే. ఆఖరికి 2021లో జరిగిన టెస్టు ఛాంపియన్ షిప్ ఫైనల్లోనూ పరాజయమే. ఇప్పుడైనా ఆ చరిత్ర మారుతుందేమో చూడాలి.