ఒకరికి తేనెటీగ కాట్లు.. మరొకరికి గాయం.. భారత జట్టు నెట్ సెషన్‌లో చేదు ఘటనలు

ఒకరికి తేనెటీగ కాట్లు.. మరొకరికి గాయం.. భారత జట్టు నెట్ సెషన్‌లో చేదు ఘటనలు

వన్డే వరల్డ్‌ కప్‌లో వరుస విజయాలతో దూకుడుమీదున్న భారత జట్టుకు బాధాకరమైన రోజుది. నెట్ సెషన్‌లో చెమటలు చిందించి కివీస్ పై ఆధిపత్యం చెలాయించాలనుకున్న భారత ఆటగాళ్లను అన్నీ అడ్డంకులే ఎదురయ్యాయి. ఒకరిని తేనెటీగలు కొడితే.. మరొకరు గాయపడి అర్థాంతరంగా ప్రాక్టీస్ ముగించారు.  

ఆదివారం (అక్టోబర్‌  22) ధర్మశాల వేదికగా భారత జట్టు.. న్యూజిలాండ్ తో తలపడనుంది. ఇప్పటివరకూ ఆడిన మ్యాచ్ లు ఓ లెక్క.. ఈ మ్యాచ్ ఓ లెక్క. మనమే కాదు.. న్యూజిలాండ్ సైతం ఆడిన నాలుగు మ్యాచ్ ల్లోనూ విజయం సాధించింది. అందునా న్యూజిలాండ్‌పై మన రికార్డులు బాగోలేవు. కివీస్ పై విజయం సాధించి 20 ఏళ్లవుతోంది. దీంతో ఆటగాళ్లు తీవ్రంగా ప్రాక్టీస్ చేయాలన్న ఉద్దేశ్యంతో నెట్ సెషన్‌లో పాల్గొనగా.. అన్నీ అడ్డంకులే ఎదురయ్యాయి. యువ క్రికెటర్ ఇషా కిషన్ పై తేనెటీగలు దాడిచేశాయి. దీంతో అతడు అక్కడినుండి పరుగులు పెట్టాడు. 

అనంతరం కొద్దిసేపటికే మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ గాయపడ్డాడు. అతని కుడిచేతి మణికట్టుపై దెబ్బ తగలడంతో తర్వాత బ్యాటింగ్ చేయలేదు. ఇలా కొద్ది నిమిషాల్లోనే భారత క్రికెటర్లకు రెండు చేదు ఘటనలు ఎదురయ్యాయి. కాగా, గాయం కారణంగా హార్ధిక్‌ పాండ్యా ఈ  మ్యాచ్ కు దూరం కాగా.. మరో ఆల్‌ రౌండర్‌  రవీంద్ర జడేజా కూడా  కివీస్‌తో మ్యాచ్‌కు దూరమయ్యే అవకాశాలున్నాయి. బంగ్లాదేశ్‌తో రెండ్రోజుల క్రితం ముగిసిన మ్యాచ్‌లో జడేజా మోకాలి నొప్పితో బాధపడినట్లు తెలుస్తోంది.  దీంతో అతన్ని ఆడించాలా..? వద్దా..? అనేది మ్యాచ్‌ ముందు నిర్ణయించనున్నారు.

భారత జట్టు(అంచనా): రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మాన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), ఇషాన్ కిషన్, రవీంద్ర జడేజా, మహమ్మద్ షమీ, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్.