
పారిస్ ఒలింపిక్స్ లో భారత హాకీ జట్టుపై చాలా అంచనాలు ఉన్నాయి. వరుసగా రెండో సారి పతకం తీసుకురావాలని దేశమంతటా కోరుకుంటుంది. అయితే పతకం రావాలంటే మాత్రం తీవ్రంగా చెమటోడ్చాల్సిందే. ఎందుకంటే పూల్ బి లో ఉన్న భారత్ జట్టుతో పాటు పటిష్టమైన దేశాలు ఉన్నాయి. బెల్జియం, అర్జెంటీనా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి జట్లతో భారత్ తలపడాల్సి ఉంది. ఇందులో భాగంగా శనివారం (జూలై 27) న్యూజిలాండ్ తో కీలక మ్యాచ్ లో తలపడాల్సి ఉంది.
ఈ మ్యాచ్ లో టీమిండియా ఫేవరేట్ గా బరిలోకి దిగుతుంది. ప్రపంచ ర్యాంకింగ్స్ లో 10 వ ర్యాంక్ లో ఉన్న కివీస్ ను తక్కువ అంచనా వేస్తే భారత్ కు షాక్ ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఈ మ్యాచ్ లో ఓడిపోతే భారత్ సెమీ ఫైనల్ అవకాశాలు సంక్లిష్టం అవుతాయి. రాత్రి 9 గంటలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ స్పోర్ట్స్ 18లో ప్రత్యక్ష ప్రసారం చేయబడుతుంది. ఆన్ లైన్ లో ఈ మ్యాచ్ ను జియో సినిమా యాప్ లో చూడొచ్చు.
1984 ఒలింపిక్స్ నుంచి 2016 రియో గేమ్స్ వరకూ ప్రతీసారి ఒట్టి చేతులతోనే తిరిగొచ్చిన హాకీ జట్టు టోక్యో ఒలింపిక్స్‌లో మాత్రం అద్భుతం చేసింది. అంచనాలను తలకిందులు చేస్తూ బ్రాంజ్ అందుకుంది. సెమీఫైనల్లో ఓడినా మూడో ప్లేస్ మ్యాచ్‌లో బలమైన జర్మనీని ఓడించి ఔరా అనిపించింది. దాంతో పారిస్ మెగా గేమ్స్‌లోనూ ఇండియా పతకం ఆశిస్తున్న ఆటల్లో హాకీ కూడా ఉంది. అంచనాలకు తగ్గ ఆటతీరు కొనసాగిస్తే హాకీలో మనకు గోల్డ్ మెడల్ వచ్చే అవకాశం ఉంది.