
మరి కొన్ని గంటల్లో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ కోసం కోట్లాది మంది క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇండియా,న్యూజిలాండ్ మధ్య మార్చి 9న మధ్యాహ్నం 2:30 గంటలకు దుబాయ్ లో జరగనున్న హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం నరాలు తెగే ఉత్కంఠతో ఉన్నారు ఫ్యాన్స్. ఇప్పటికే క్రికెట్ అభిమానులు, సినీ నటులు,రాజకీయ నాయకులు దుబాయ్ కి చేరుకున్నారు. స్టేడియం పరిసర ప్రాంతాలలో ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.
మరో వైపు ఫైనల్ మ్యాచ్ లో ఇండియా టైటిల్ గెలవాలని దేశ వ్యాప్తంగా క్రికెట్ ఫ్యాన్స్ పూజలు చేస్తున్నారు. క్రికెట్ ఫ్యాన్స్ దేవుడికి మొక్కుకుంటున్నారు. పలు చోట్ల యజ్ఞ యాగాలు నిర్వహిస్తున్నారు. జాతీయ పతాకాలతో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ గిల్, రాహుల్, పాండ్యా శ్రేయస్ అయ్యర్ ఫోటోలతో ఆలయాల్లో అర్చనలు చేస్తున్నారు. యూపీ వారణాసి ఆలయంలో ఆంజనేయ విగ్రహం ముందు నిల్చుని హనుమాన్ చాలీసా చదివారు
#WATCH | #ICCChampionsTrophy | Ayodhya, UP | Saints perform 'havan' for the victory of team India ahead of the #INDvsNZ finals.
— ANI (@ANI) March 9, 2025
Unbeaten India is set to take on New Zealand in Dubai today. In the semifinals, India secured their place in the final with a four-wicket win over… pic.twitter.com/Fp5vdbfhRZ
అరబ్ గడ్డపై అజేయంగా దూసుకెళ్తున్న రోహిత్‌సేన ఆఖరాటలోనూ అదే హవా కొనసాగించాలని.. 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో ఎదురైన పరాజయానికి ప్రతీకారం తీర్చుకొని మరోసారి ఐసీసీ చాంపియన్ అవ్వాలని ఆశిస్తున్న కోట్లాది మంది అభిమానులు.. విజయోస్తు అని మన జట్టును దీవిస్తున్నారు. మరి టీమిండియా మూడోసారి ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ విజేతగా నిలుస్తుందా?
వరుసగా నాలుగు మ్యాచ్‌లు. అన్నింటిలోనూ ఏకపక్ష విజయాలు. బ్యాటింగ్‌లో తిరుగులేదు.. బౌలింగ్‌లో ఎదురులేదు. ఇదే జోరుతో ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే మెగా ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఓడించి మూడోసారి చాంపియన్స్ ట్రోఫీని అందుకోవాలని టీమిండియా పట్టుదలగా బరిలోకి దిగుతోంది. లీగ్ దశ చివరి మ్యాచ్‌లో బ్లాక్‌క్యాప్స్ జట్టును ఓడించినప్పటికీ దాన్ని తక్కువగా అంచనా వేయడానికి లేదు.
ఆస్ట్రేలియా మాదిరిగా ఐసీసీ టోర్నమెంట్లలో న్యూజిలాండ్ ఎప్పుడూ ఇండియాకు కఠిన ప్రత్యర్థే. ఐసీసీ ఈవెంట్లలో మన జట్టుతో ముఖాముఖీ మ్యాచ్‌ల్లో ఆ టీమ్ 10–6తో ఆధిక్యంలో ఉంది. నాకౌట్ రౌండ్లలో ఇరు జట్లూ నాలుగు సార్లు తలపడితే కివీస్ మూడుసార్లు నెగ్గి 3–1తో ముందంజలో నిలిచింది. ఇందులో 2019 వన్డే వరల్డ్ కప్ సెమీఫైనల్ ఓటమి మన టీమ్‌ను చాలా కాలం వెంటాడింది. దాంతో పాటi2021 వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లోనూ కివీస్ చేతిలో ఓటమికి ప్రతీకారం తీర్చుకునే అవకాశం ఇప్పుడు రోహిత్‌సేన ముందుంది.
స్పిన్నర్లే విన్నర్లు
మెగా టోర్నీలో టీమిండియా నలుగురు స్పిన్నర్లను బరిలోకి దింపడం మాస్టర్ స్ట్రోక్ అయింది. ముఖ్యంగా వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్ తమ రైట్–లెఫ్ట్ రిస్ట్ స్పిన్‌తో ప్రత్యర్థులను ఓ ఆటాడుకుంటున్నారు. అదే టైమ్‌లో స్పిన్ ఆల్‌రౌండర్లు రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ బంతితో పాటు బ్యాట్‌తోనూ మ్యాజిక్ చేస్తున్నారు. టోర్నీలో ఇప్పటిదాకా 21 వికెట్లు పడగొట్టిన స్పిన్నర్లు ఫైనల్లోనూ అత్యంత కీలకం కానున్నారు. ఇక, న్యూజిలాండ్‌పైనే డబుల్ సెంచరీతో వన్డేల్లో తన మార్కు చూపెట్టిన ఓపెనర్ శుభ్‌మన్ గిల్ మెగా ఫైనల్లోనూ ఆ టీమ్‌పై మెరుగైన పెర్ఫామెన్స్ చేయాలని చూస్తున్నాడు.
ఓపెనర్లు రోహిత్, గిల్ మంచి పునాది వేస్తే మిడిలార్డర్‌పై ఒత్తిడి తగ్గుతుంది. ఇక, కింగ్ విరాట్ కోహ్లీ సూపర్ ఫామ్‌లో ఉండగా.. మిడిలార్డర్‌లో శ్రేయస్ అయ్యర్ నిలకడ జట్టును దుర్బేధ్యంగా మార్చింది. అవకాశం వచ్చినప్పుడు అక్షర్, కేఎల్ రాహుల్, హార్దిక్ పాండ్యా కూడా ఆకట్టుకున్నారు. ఆఖరాటలో వీళ్లంతా సమష్టిగా పోరాడితే జట్టుకు తిరుగుండదు. ఈ మ్యాచ్‌లోనూ ఇండియా నలుగురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం ఖాయమే. చివరి రెండు లీగ్ మ్యాచ్‌ల్లో ఒక్క వికెట్ తీయని పేసర్ షమీ..సెమీస్‌లో ఆసీస్‌పై అద్భుతంగా బౌలింగ్ చేసి ఫామ్ అందుకున్నాడు. ఫైనల్లో కొత్త బంతితో ఆరంభంలోనే వికెట్లు తీసే బాధ్యతను తీసుకోవాలి.