India vs Pakistan: ఆ మ్యాచ్ నేను, ధోనీ కాదు.. హర్భజన్ గెలిపించాడు: గౌతం గంభీర్

India vs Pakistan: ఆ మ్యాచ్ నేను, ధోనీ కాదు.. హర్భజన్ గెలిపించాడు: గౌతం గంభీర్

'ఎంఎస్ ధోని vs గౌతం గంభీర్..' వీరిలో విమర్శలు చేసేవారు ఒకరైతే.. వాటిని విననట్లే వదిలేసేవారు మరొకరు. 2011 వరల్డ్ కప్ విజయం విషయంలో గంభీర్ ఇప్పటిదాకా ఎన్ని సార్లు స్పందించారో మనం చూశాం. చివర్లో ఓ సిక్స్ కొట్టినంత మాత్రాన అతడే గెలిపించినట్లా..! అతని గురించే మాట్లాడుకుంటారా..! గెలిపించింది యువరాజ్ కాదా! అంటూ ఇప్పటికీ తన అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. తాజాగా, గంభీర్ మరో మ్యాచ్ విషయంలోనూ ఇలాంటి వ్యాఖ్యలే చేశాడు.

ఇండియా vs పాకిస్తాన్

2010 ఆసియా కప్ టోర్నీలో ఇండియా- పాకిస్తాన్ తలపడగా.. ఆ మ్యాచ్‌లో భారత జట్టు ఘన విజయం సాధించింది. పాక్ నిర్ధేశించిన 268 పరుగుల లక్ష్యాన్ని.. మరో బంతి మిగిలివుండగానే చేధించింది. ఆ విజయంలో ధోనీ- గంభీర్ భాగస్వామ్యం కీలకపాత్ర పోషించింది. సెహ్వాగ్(10), కోహ్లీ(18) వికెట్లను త్వరగా కోల్పోయిన భారత జట్టును వీరిద్దరూ 102 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పి ఆదుకున్నారు. అయితే ఆ మ్యాచ్‌ను తాను, ధోనీ గెలిపించలేదని.. హర్భజన్ గెలిపించాడని గంభీర్ చెప్పుకొచ్చారు.

"ఆ మ్యాచ్ నేను గెలిపించలేదు.. హర్భజన్ సింగ్ గెలిపించాడు. నేను- ధోనీ కలిసి భాగస్వామ్యం నెలకొల్పడం వల్ల మ్యాచ్ గెలిచి ఉండొచ్చు.. కానీ చివర్లో రన్స్ చేసిన వాళ్లే టీమ్‌ను గెలిపించినట్లు కదా! అందువల్లే హర్భజన్ గెలిపించినట్లు.. ఆ మ్యాచ్‌లో షోయబ్ అక్తర్ మంచి ఫామ్ లో ఉన్నాడు. కానీ అతనికి వెలుతురు సహకరించలేదు..." అని గంభీర్ చెప్పుకొచ్చాడు.

శ్రీలంకపై ధోని.. సిక్స్

2011 ప్రపంచ కప్ ఫైనల్‌లో శ్రీలంకపై 91 పరుగులు చేసిన ధోనీ.. ఆఖరిలో సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో గంభీర్ 97 పరుగులు చేసినప్పటికీ.. అందుకు తగిన గుర్తింపు దక్కలేదు. సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించినంత మాత్రాన ధోనీ గెలిపించినట్లు ఎలా అవుతుందని గంభీర్ అంటున్నాడు. ఈ విషయాన్ని గుర్తుచేయడం కోసమే.. హర్భజన్‌ను తీసుకొచ్చాడు.

కాగా, ఈ మ్యాచ్‌లో గంభీర్(83) పరుగులతో టాప్ స్కోరర్‪గా నిలిచి మ్యాన్ అఫ్ ది మ్యాచ్ అందుకోగా.. ధోని 56 పరుగులు చేశారు. విజయానికి చివరి  రెండు బంతుల్లో మూడు పరుగులు అవసరమైన సమయంలో హర్భజన్.. సిక్స్ కొట్టి మ్యాచ్ ముగించాడు.