రాహుల్, కోహ్లీ సెంచరీలు.. దాయాది ముందు భారీ టార్గెట్

రాహుల్, కోహ్లీ సెంచరీలు.. దాయాది ముందు భారీ టార్గెట్

ఆసియా క‌ప్‌ 2023లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతోన్న సూప‌ర్ -4 మ్యాచ్‌లో భార‌త బ్యాటర్లు చెల‌రేగి ఆడారు. విరాట్ కోహ్లీ(122 నాటౌట్‌), కేఎల్ రాహుల్(111 నాటౌట్‌) జోడి సెంచరీల మోత మోగిస్తే.. రోహిత్ శర్మ(56), శుభ్ మాన్ గిల్ (58) జోడి హాఫ్ సెంచరీలతో మెరిశారు. దీంతో భార‌త జ‌ట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్ల న‌ష్టానికి 356 పరుగుల భారీ స్కోర్ చేసింది. 

కలిసొచ్చిన రిజ‌ర్వ్ డే

వర్షం అంతరాయం కారణంగా మ్యాచ్ రిజ‌ర్వ్ డే రోజుకు వాయిదా పడిన విషయం తెలిసిందే. భార‌త్ ఇన్నింగ్స్ 24.1వ ఓవ‌ర్ నుంచి ఆట తిరిగి ప్రారంభం కాగా.. కోహ్లీ, రాహుల్ దాయాది పాకిస్థాన్‌ బౌలర్ల‌ను చీల్చిచెండాడారు. బంతి బౌండరీకి పరుగెడుతుంటే.. పాక్ ఆటగాళ్లు దాని వెంట పరుగులు పెట్టారు. వీళ్లిద్ద‌రూ దూకుడుతో పాక్ బౌల‌ర్లు దిక్కుతోచ‌ని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. అంతకుముందు భారత ఓపెన‌ర్లు రోహిత్ శ‌ర్మ‌(56), శుభ్‌మ‌న్ గిల్‌(58).. పాక్ పేస్ త్ర‌యాన్ని ఉతికారేశారు. తొలి వికెట్‌కు 121 పరుగులు  జోడించారు. అయితే వ‌రుస ఓవ‌ర్ల‌లో వీరిద్దరూ ఔటైనా.. ఆ త‌ర్వాత కోహ్లీ, రాహుల్ మ‌రో వికెట్ ప‌డ‌కుండా భారత ఇన్నింగ్స్ ముగించారు.

13వేల క్ల‌బ్‌లో కోహ్లీ

ఈ మ్యాచ్ లో శతకం ద్వారా వన్డేల్లో 47వ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ(122).. 13వేల క్ల‌బ్‌లో చేరాడు. ఈ సెంచరీతో కోహ్లీ.. 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌లో అత్య‌ధిక సెంచ‌రీలు బాదిన రెండో క్రికెట‌ర్‌గా మరో రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు.