వన్డే వరల్డ్ కప్ 2023.. భారత్ పాక్ మ్యాచ్ జరిగేది అనుమానమే..కారణమిదే

వన్డే వరల్డ్ కప్ 2023.. భారత్ పాక్ మ్యాచ్ జరిగేది అనుమానమే..కారణమిదే

మరో మూడు నెలల్లో వన్డే వరల్డ్ సమరం మొదలు కాబోతుంది. అక్టోబర్ 5 నుంచి మన దేశంలో మెగా టోర్నీ జరగనుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు మొత్తం 10 స్టేడాయాలో   వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఇప్పటికే వన్డే వరల్డ్ కప్ షెడ్యూల్ను బీసీసీఐ ప్రకటించింది. ఈ టోర్నీలో భారత్ తొలి మ్యాచ్ అక్టోబర్ 8న ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఆ తర్వాత దాయాది పాకిస్తాన్ తో టీమిండియా అక్టోబర్ 15వ తేదీన మ్యాచ్ ఆడబోతోంది. అయితే ఈ మ్యాచ్ జరగడం అనుమానంగా మారింది. 

భారత్ పాక్ మ్యాచ్ జరిగేనా...

భారత్ పాక్ మ్యాచ్ అంటేనే ఒక క్రేజ్.  ఈ రెండు జట్ల మధ్య ఎప్పుడు మ్యాచ్ జరిగినా కూడా అది హైవోల్టేజ్ మ్యాచ్ అవుతుంది. ఈ నేపథ్యంలో త్వరలో జరిగబోయే వన్డే వరల్డ్ కప్ లో భారత్ పాక్ జట్లు ఢీకొట్టుకోబోతున్నాయి. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం టీమిండియా, పాకిస్తాన్ జట్ల మధ్య అక్టోబర్ 15వ తేదీన మ్యాచ్ జరిగాలి. కానీ ఈ మ్యాచ్ జరిగేది అనుమానంగా మారింది. కారణం దసరా నవరాత్రులే. 

ALSO READ :టికెట్​ ఇస్తే కాంగ్రెస్‌లోకి..బీఆర్‌‌ఎస్‌ లీడర్ వెంకటేశ్వర్ రెడ్డి

ఎప్పుడు జరుగుతుంది అంటే..

భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రోజే అంటే అక్టోబర్ 15వ తేదీన  నవరాత్రులు ఆరంభం కానున్నాయి. గుజరాత్ లో నవరాత్రులను వైభవంగా నిర్వహిస్తారు.  ఆ సమయంలో ప్రతి రోజు రాత్రి గుజరాతీలు 'గర్బా'  నృత్యాలు చేస్తూ సంబరాలు చేసుకుంటారు.  అదే సమయంలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్ జరుగుతుండటం... ఈ మ్యాచ్ కోసం భారతీయులతో పాటు పాకిస్తాన్ అభిమానులు కూడా అహ్మదాబాద్ కు రానున్నారు. దీంతో సెక్యూరిటీ విషయంలో సమస్యలు రావొచ్చని బీసీసీఐని నిఘా వర్గాలు హెచ్చరించాయి. దీంతో టీమిండియా , పాకిస్తాన్ మ్యాచ్ తేదీపై బీసీసీఐ మరోసారి ఆలోచనలో పడింది. ఈ మ్యాచును  అక్టోబర్ 15న నిర్వహించాలా లేక నవరాత్రులు ముగిశాక నిర్వహించాలా అనే ఆలోచనలో పడింది. నవరాత్రులు అక్టోబర్ 15 నుంచి 24 వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో ప్రపంచకప్ కు ఆతిథ్యమిస్తోన్న రాష్ట్ర క్రికెట్  సంఘాలతో బీసీసీఐ జులై 27వ తేదీ ల 27న మీటింగ్ నిర్వహించనుంది. ఈ సమావేశంలో భారత్, పాక్ మ్యాచ్ తేదీ మార్పుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ విషయాన్ని ఐసీసీకి తెలియజేయనుంది. అనంతరం ఐసీసీ .. భారత్, పాకిస్తాన్ మ్యాచ్ రీషెడ్యూల్ తేదీని ప్రకటిస్తుంది. 


అభిమానులకు ఇబ్బంది..

భారత్, పాక్ మ్యాచ్ ను రీషెడ్యూల్ చేసినా..ఆదివారమే నిర్వహించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఒక వారం ముందుకు జరిపినా.. వెనక్కి జరిపినా ఇతర మ్యాచ్ లపై ప్రభావం చూపే అవకాశం ఉంది. అలా జరగకుండా ఉండాలంటే....ఈ మ్యాచ్ వేదికను మారిస్తే సరిపోతుంది. కానీ దీని వల్ల అభిమానులకు ఇబ్బందులు ఎదురవుతాయి. ఇప్పటికే అభిమానులు  అహ్మదాబాద్ కు ఫ్లైట్ టికెట్లు, హోటల్ బుక్ చేసుకున్నారు.  వేదిక మారిస్తే మాత్రం  అభిమానులు నష్టపోతారు.