కోట్లాది మంది క్రికెట్ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన దాయాదుల పోరు ఆశించిన మజాను అందించింది. వన్డే ప్రపంచ కప్‌లలో ఎన్నిసార్లు ఎదురొచ్చినా గెలిచేది తామే అనేలా భారత జట్టు.. పాక్‌ను చిత్తుచిత్తుగా ఓడించింది. తొలుత పాక్ 191 పరుగులకే కుప్పకూలగా.. ఛేజింగ్ లో రోహిత్ శర్మ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. నలువైపులా బౌండరీలు బాదుతూ పాక్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ ఓటమిని పాక్ ఆటగాళ్లు, ఆ జట్టు మేనేజ్మెంట్ జీరించుకోలేకపోతోంది.
కళకళలాడిన అహ్మదాబాద్ స్టేడియం
కాలం మారింది.. క్రికెట్ ఆడే తీరు మారింది. గతంతో పోలిస్తే భారత్-పాక్ మ్యాచ్‌లంటే ఉండే ఉద్విగ్న వాతావరణంలోనూ మార్పొచ్చింది. ఆటగాళ్లు కూడా స్నేహపూర్వకంగా ఉంటున్నారు. కానీ, ఇరు దేశాల అభిమానుల్లో మాత్రం ఎలాంటి మార్పు కనిపించడం లేదు. క్రికెట్‌లోనే అత్యున్నత టోర్నీ.. అందునా ఇండియా- పాకిస్తాన్ మ్యాచ్ కావడంతో నరేంద్ర మోడీ స్టేడియానికి పోటెత్తారు. ఏకంగా లక్షా ముప్పైవేల మంది హాజరయ్యారు. వీరిలో వెయ్యి మంది మినహా మిగిలిన వారంతా భారత అభిమానులే. ఇదే పాక్ మేనేజ్మెంట్ కు రుచించడం లేదు.
ఇది ఐసీసీ టోర్నీ కాదు.. బీసీసీఐ ఈవెంట్
భారత్‌తో జరిగిన ప్రపంచ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ అభిమానులు లేకపోవడం పాక్ టీమ్ మేనేజ్‌మెంట్ ను నిరుత్సాహానికి గురి చేసింది. వారికి మద్దతుగా పాక్ స్లొగన్స్ ఒక్కటీ వినిపించకపోవడతంతో.. ఇది ఐసీసీ టోర్నీయే కాదని బాంబ్ పేల్చారు. అహ్మదాబాద్ వాతావరణం చూశాక.. ఈ మ్యాచ్ ఐసీసీ ఈవెంట్ లా కనిపించలేదని.. భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) నిర్వహించిన ద్వైపాక్షిక కనిపించిందని ఆ జట్టు డైరెక్టర్ మిక్కీ ఆర్థర్ మీడియా సమావేశంలో మాట్లాడాడు.
"చూడండి.. నేను చెప్తున్నది అబద్ధం అని మీరు అనుకోవచ్చు.. నిజాయితీగా చెప్పాలంటే ఇది ఐసిసి ఈవెంట్‌లా అనిపించలేదు. బిసిసిఐ నిర్వహించిన ద్వైపాక్షిక సిరీస్‌లా అనిపించింది. మాకు మద్దతుగా ఒక్క స్లోగన్ వినలేదు. దిల్ దిల్ పాకిస్తాన్ అన్న ఒక్క పదం వినలేదు.." అని మిక్కీ ఆర్థర్ తన అసహనాన్ని వెళ్లబుచ్చాడు.
Mickey Arthur: "It didn't seem like an ICC event tonight" ?️#INDvPAK | #CWC23 pic.twitter.com/12PdMEcs0E
— ESPNcricinfo (@ESPNcricinfo) October 14, 2023
అటు 11 మంది.. ఇటు రోహిత్ ఒక్కడే
ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టు చిత్తుచిత్తుగా ఓడింది. పాక్ నిర్ధేశించిన 192 పరుగుల విజయ లక్ష్యాన్ని భారత్.. మరో 19.3 ఓవర్లు మిగిలివుండగానే చేధించింది. లక్ష్య ఛేదనలో భారత కెప్టెన్ రోహిత్ శర్మ(86; 63 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులు).. పాక్ బౌలర్లను ఊచకోత కోస్తూ వీరవిహారం చేశాడు. ఈ విజయంతో భారత్(+1.821) పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.