IND vs PAK: అనుమానపడ్డాడు.. అందుకే కండలు చూపించా..!: రోహిత్ శర్మ

పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో హిట్ మ్యాన్(రోహిత్ శర్మ) మెరుపులు మెరిపించిన విషయం విదితమే. ప్రపంచ క్రికెట్‌లో తామే గొప్ప బౌలర్లమంటూ విర్రవీగే పాక్ బౌలర్లను.. కోట్లాది మంది ప్రేక్షకులకు గల్లీ బౌలర్లని చాటిచెప్పాడు. తృటిలో సెంచ‌రీ చేజారినా.. మైదానం నలువైపులా బౌండరీలు బాదుతూ అభిమానులను ఎంటర్టైన్ చేశాడు.

ఈ మ్యాచ్‌లో 36 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న రోహిత్.. అంపైర్‌కు కండలు చూపిస్తూ సంబరాలు చేసుకోవడం మనందరం చూశాం. ఆ సమయంలో ఎందుకు..? ఏంటి..? అనేది తెలియకపోయినా.. బలశాలి కదా! చుపించాడులే అని నవ్వుకున్నాం.. మ్యాచ్ అనంతరం ఇదే విషయంపై హార్దిక్ పాండ్యా అతన్ని ప్రశ్నించగా.. దాని వెనుకున్న అసలు కారణం వెలుగులోకి వచ్చింది.

ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ సిక్సర్లు కొట్టడం చూసి అంపైర్ అనుమానపడ్డాడట. డీప్ స్క్వేర్ లెగ్, మిడాన్, కవర్స్,  వైడ్ లాంగాన్ మీదుగా అతడు కొట్టిన సిక్సులు చూసి బ్యాట్‌లో ఏమైనా ఉందా అని హిట్ మ్యాన్ ని ప్రశ్నించాడట. ఆ అనుమానాలు నివృత్తి చేసేందుకే రోహిత్ కండలు చూపించాడట." సిక్సర్లు చూసి అంపైర్.. ఇంత ఈజీగా ఎలా కొడుతున్నావని అడిగాడు. బ్యాట్‌లో ఏం ఉందని ప్రశ్నించాడు. బ్యాట్‌లో ఏం లేదు.. అది నా కండ బలమని చెప్పాను.." అని రోహిత్.. పాండ్యాతో చెప్తున్న మాటలు నెట్టింట వైరల్‌ అవుతున్నాయి.