IND vs RSA: కోహ్లీ సెంచరీ.. సఫారీల ముందు భారీ టార్గెట్

IND vs RSA: కోహ్లీ సెంచరీ.. సఫారీల ముందు భారీ టార్గెట్

వన్డే ప్రపంచ కప్‌లో భాగంగా దక్షిణాఫ్రికా జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా నిర్ణీత ఓవర్లలో 326 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత స్టార్ బ్యాటర్, బర్త్ డే బాయ్ విరాట్ కోహ్లీ(101; 121 బంతుల్లో 10 ఫోర్లు) శతకం బాదాడు. దీంతో వన్డేల్లో 49వ సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ.. అంతర్జాతీయ క్రికెట్‌లో భారత మాజీ దిగ్గజం సచిన్(వన్డేల్లో 49 సెంచరీలు) రికార్డును సమం చేశాడు.

ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టుకు ఓపెనర్లు రోహిత్‌ శర్మ (40), శుభ్‌మన్‌ గిల్‌  (23) మెరుపు ఆరంభాన్ని ఇచ్చారు. అనంతరం ధాటిగా ఆడే ప్రయత్నంలో వీరిద్దరూ వెనుదిరిగినా.. కోహ్లీ(101; 121 బంతుల్లో 10 ఫోర్లు)- శ్రేయస్‌ అయ్యర్‌(77; 87 బంతుల్లో 7 ఫోర్లు, 2 సిక్సులు) జోడి నిలకడగా ఆడుతూ జట్టును ముందుకు నడిపించారు. ఒకానొక సమయంలో జట్టు 350 పరుగులు దాటుతుంది అనిపించినా.. అయ్యర్, కేఎల్ రాహుల్ వెనుదిరిగాక ఇన్నింగ్స్ మందకొడిగా సాగింది. కోహ్లీ జట్టు కంటే సెంచరీకే అధిక ప్రాధాన్యమిచ్చాడు. ఆఖరిలో సూర్యకుమార్ యాదవ్(22), రవీంద్ర జడేజా(29) పర్వాలేదనిపించారు.

సఫారీ బౌలర్లలో లుంగీ ఎన్గిడి, మార్కో జాన్సెన్, కగిసో రబడ, కేశవ్ మహారాజ్, తబ్రైజ్ షమ్సీ.. తలో వికెట్ తీశారు.