IND vs SA 1st Test: వెలుతురు లేమి.. ముగిసిన రెండో రోజు ఆట

IND vs SA 1st Test: వెలుతురు లేమి.. ముగిసిన రెండో రోజు ఆట

సెంచూరియన్ వేదికగా భారత్‌, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టుకు రోజుకో అంతరాయం కలుగుతోంది. తొలి రోజు వర్షం కారణంగా ఆట నిలిచిపోగా.. రెండో రోజు వెలుతురు లేమి సమస్య అడ్డొచ్చింది. వాస్తవానికి రెండో రోజు 98 ఓవర్లు ఆట కొనసాగాలి. కానీ, బ్యాడ్ లైట్ కారణంగా 75 ఓవర్లకే అంపైర్లు ఆటను నిలిపివేశారు. ఇది ఒకరకంగా భారత జట్టుకు లాభదాయకమే.

తొలి టెస్టులో దక్షిణాఫ్రికా పైచేయి సాధించింది. తొలుత భారత్ జట్టును 245 పరుగులకే కట్టడి చేసిన దక్షిణాఫ్రికా రెండో రోజు అట నిలిచే సమయానికి ఐదు వికెట్ల నష్టానికి 256 పరుగులు చేసింది. ప్రస్తుతం సఫారీలు 11 పరుగుల ఆధిక్యంలో ఉన్నారు. కెరీర్‌లో చివరి టెస్టు సిరీస్‌ ఆడుతున్న సఫారీ ఓపెనర్ డీన్‌ ఎల్గర్‌ (211 బంతుల్లో 140 నాటౌట్‌, 23 ఫోర్లు) సెంచరీతో కదం తొక్కగా.. అతడికి  కెరీర్‌లో తొలి టెస్టు ఆడుతున్న డేవిడ్‌ బెడింగ్‌హామ్‌ (87 బంతుల్లో 56, 7 ఫోర్లు, 2 సిక్సర్లు) చక్కని సహకారం అందించాడు.

ఆదుకున్న రాహుల్‌

అంతకుముందు భారత జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 245 పరుగుల వద్ద ఆలౌట్‌ అయ్యింది. 208/8 ఓవర్‌నైట్‌ స్కోర్‌తో రెండో రోజు ఆట ప్రారంభించిన భారత జట్టు.. అదనంగా మరో 37 పరుగులు మాత్రమే జోడించింది.