బార్బడోస్ వేదికగా గత నెల 29న శనివారం దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో భారత్ జట్టు విజయం సాధించిన విషయం తెలిసిందే. ఆఖరి బంతి వరకూ నరాలు తెగే ఉత్కంఠను పంచిన ఫైనల్ పోరులో రోహిత్ సేన 7 పరుగుల స్వల్ప తేడాతో గట్టెక్కింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 176 పరుగులు చేయగా.. ఛేదనలో సఫారీ జట్టు 169 పరుగులు మాత్రమే చేసింది. ఫలితంగా, భారత జట్టు రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను ముద్దాడింది. ఈ మ్యాచ్ అనంతరం భారత మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించారు.
ఫైనల్లో విరాట్ 59 బంతుల్లో 76 పరుగులు చేసి జట్టు విజయంలో కీల పాత్ర పోషించాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును.. అక్సర్ పటేల్(31 బంతుల్లో 47), శివమ్ దూబే(16 బంతుల్లో 27)ల సహకారంతో గట్టెక్కించాడు. 176 పరుగులు సాధించి సఫారీల ఎదుట పోరాడే లక్ష్యాన్ని నిలిపాడు. ఈ అసాధారణమైన నాక్‌కు అతను 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'ని కూడా గెలుచుకున్నాడు. ఈ అవార్డుతో కోహ్లీ తన చివరి టీ20లో మ్యాచ్ అవార్డును గెలుచుకున్న రెండో భారత ఆటగాడిగా నిలిచాడు.
గతంలో సుబ్రమణ్యం బద్రీనాథ్ ఈ ఘనత సాధించాడు. 2011లో తన కెరీర్‌లో ఆడిన ఏకైక టీ20లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్నాడు. బద్రీనాథ్ తన అరంగేట్ర మ్యాచ్ లో వెస్టిండీస్‌పై 37 బంతుల్లో 43 పరుగులు చేశాడు. అదే అతని అత్యుత్తమ ప్రదర్శన. టీ20 ఫార్మాట్‌లో అతనికి కెరీర్‌లో చివరి మ్యాచ్.
చివరి టీ20లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న భారత ఆటగాళ్లు
- సుబ్రమణ్యం బద్రీనాథ్: 37 బంతుల్లో 43 పరుగులు (వెస్టిండీస్‌పై, 2011)
- విరాట్ కోహ్లీ: 59 బంతుల్లో 76 పరుగులు (దక్షిణాఫ్రికాపై, 2024)
ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు పొందిన వెంటనే కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటన చేశాడు. అంతేకాదు, దక్షిణాఫ్రికాతో ఫైనల్‌లో భారత్ ఓడిపోయినా తన నిర్ణయం మారదని 35 ఏళ్ల విరాట్ పేర్కొన్నాడు.