IND vs SA: శాంసన్‌‌, తిలక్ వర్మ శతకాలు.. సిరీస్ గెలిచిన టీమిండియా

IND vs SA: శాంసన్‌‌, తిలక్ వర్మ శతకాలు.. సిరీస్ గెలిచిన టీమిండియా
  • సంజూ వందనం.. తిలక్ తాండవం
  • సెంచరీలతో దంచికొట్టిన శాంసన్‌‌, తిలక్ వర్మ
  • నాలుగో టీ20లో   135 రన్స్ తేడాతో సౌతాఫ్రికాపై  గ్రాండ్ విక్టరీ
  • 3-1తో సిరీస్ గెలిచిన టీమిండియా

మన హైదరాబాదీ తిలక్‌‌ వర్మ మళ్లీ మెరిశాడు. తనకు నచ్చిన మూడో నంబర్‌‌‌‌లో వచ్చి మూడో టీ20లో దుమ్మురేపిన తిలక్ ఈసారి విశ్వరూపం చూపెట్టాడు. వాండరర్స్‌‌ స్టేడియంలో సౌతాఫ్రికాతో ఆఖరి పోరులో వండర్‌‌‌‌ఫుల్ ఆటతో  వరుసగా రెండో సెంచరీ కొట్టేశాడు. బంతి ఎక్కడ పడ్డా.. దాన్ని ఎవ్వరు వేసినా తన బ్యాట్‌‌కు తగిలితే బౌండ్రీలైన్ అవతల పడాల్సిందే అన్నట్టుగా సాగింది అతని ఆట. బ్యాట్‌‌తో తిలక్‌‌ చేసిన తాండవానికి తోడు వరుసగా రెండు డకౌట్ల తర్వాత సంజూ శాంసన్ కూడా సెంచరీతో దంచికొట్టడంతో 17 ఫోర్లు, 23 సిక్సర్లతో స్టేడియం తడిసిముద్దయింది. ఈ ఇద్దరి డబుల్ సెంచరీ భాగస్వామ్యంతో  టీ20ల్లో తమ రెండో అత్యధిక స్కోరు చేసిన టీమిండియా తర్వాత బౌలింగ్‌‌లోనూ రెచ్చిపోయింది. సఫారీలను కూనలను చేసి చివరి టీ20లో చిత్తుగా ఓడించింది. సిరీస్‌ను 3–1తో కైవసం చేసుకుంది. 

జొహనెస్‌‌బర్గ్‌‌: టీ20 వరల్డ్ చాంపియన్‌‌ ఇండియా ఈ ఫార్మాట్‌‌లో తమకు తిరుగేలేదని మరోసారి చాటి చెప్పింది. ఈ ఏడాది తమ ఆఖరి టీ20 పోరులో రికార్డు విక్టరీతో అదరగొట్టింది. తిలక్‌‌ (47 బాల్స్‌‌లో 9 ఫోర్లు, 10 సిక్సర్లతో 120 నాటౌట్‌‌), శాంసన్  (56 బాల్స్‌‌లో 6 ఫోర్లు, 9 సిక్సర్లతో 109 నాటౌట్‌‌) మెరుపు సెంచరీలకు తోడు బౌలర్లూ విజృంభించడంతో  శుక్రవారం జరిగిన, నాలుగో టీ20లో ఇండియా  135  రన్స్ తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసింది. తొలుత  ఇండియా     20 ఓవర్లలో 283/1 స్కోరు చేసింది. అభిషేక్ శర్మ (36) కూడా రాణించాడు. ఛేజింగ్‌‌లో ఆతిథ్య జట్టు 18.2  ఓవర్లలో 148  రన్స్‌‌కే ఆలౌటైంది. ట్రిస్టాన్ స్టబ్స్‌‌ (43), మిల్లర్ (36) కాసేపు పోరాడారు. ఇండియా బౌలర్లలో అర్ష్‌‌దీప్‌‌ సింగ్‌‌ మూడు, వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లతో రాణించారు. తిలక్‌‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్, సిరీస్‌‌ అవార్డులు దక్కాయి. 

86 బాల్స్‌‌... 210 రన్స్‌‌

ఫ్లాట్‌‌ పిచ్‌‌పై టాస్ నెగ్గి బ్యాటింగ్‌‌కు వచ్చిన టీమిండియా ప్రత్యర్థి బౌలింగ్‌‌ను ఊచకోత కోసింది. కొయెట్జీ వేసిన రెండో ఓవర్లోనే శాంసన్‌‌ 6,4తో మొదలైన విధ్వంసం ఆఖరి ఓవర్‌‌ వరకూ సాగింది. గత రెండు ఇన్నింగ్స్‌‌ల్లో తొలి ఓవర్లలోనే డకౌటైన శాంసన్‌‌ తిరిగి గాడిలో పడగా.. మరో ఓపెనర్ అభిషేక్‌‌ శర్మ క్రీజులో ఉన్నంతసేపు వరుస షాట్లతో ఆకట్టుకున్నాడు. యాన్సెన్‌‌ బౌలింగ్‌‌లో సిక్స్‌‌తో బౌండ్రీల ఖాతా తెరిచిన అతను సిమిలానె బౌలింగ్‌‌లో 6, 4, 4 , 6 తో అలరించడంతో ఐదు ఓవర్లకే స్కోరు ఫిఫ్టీ దాటింది. తర్వాతి ఓవర్లో అతడిని సిపమ్లా ఔట్‌‌ చేసి తొలి వికెట్‌‌కు 73 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. 

తన తొలి ఆరు బంతుల్లో నాలుగే రన్స్ చేసిన తిలక్‌‌.. స్పిన్నర్ కేశవ్‌‌ వేసిన తొమ్మిదో ఓవర్లో వరుసగా రెండు భారీ సిక్సర్లతో టచ్‌‌లోకి వచ్చాడు. ఇక్కడి నుంచి స్కోరుబోర్డు జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. స్టబ్స్‌‌ బౌలింగ్‌‌లో శాంసన్‌‌ 6, 6 కొట్టి ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. తిలక్‌‌ 4, 4 కొట్టడంతో సగం ఓవర్లకే  ఇండియా 129/1తో నిలిచింది. 11వ ఓవర్లో సిమిలానె షార్ట్‌‌పిచ్‌‌ బాల్‌‌ భుజానికి బలంగా తాకడంతో తిలక్ నొప్పితో బాధపడ్డాడు. కానీ, ఫిజియోతో చికిత్స తీసుకున్న తర్వాత అతను మరింత స్పీడు పెంచాడు.  ఓవైపు తిలక్.. మరోవైపు శాంసన్  ఖతర్నాక్‌‌ షాట్లతో పోటాపోటీగా సిక్సర్ల వర్షం కురిపించడంతో సఫారీ బౌలర్లు తలలు పట్టుకున్నారు. 22 బాల్స్‌‌లోనే ఫిఫ్టీ దాటిన తిలక్ ఆ తర్వాత టాప్ గేర్‌‌‌‌లోకి వచ్చేశాడు. సఫారీ కెప్టెన్ మార్‌‌‌‌క్రమ్ వేసిన 14వ ఓవర్లో 4, 6, 6, 4తో రెచ్చిపోయాడు. కొయెట్జీ బౌలింగ్‌‌లో తిలక్, శాంసన్‌‌ చెరో సిక్స్ బాదడంతో 15 ఓవర్లకే స్కోరు 210 దాటింది. 

వీళ్ల జోరు చూస్తుంటే ఇండియా 300 స్కోరు చేసేలా కనిపించింది. స్లాగ్‌‌ ఓవర్లలో సఫారీ బౌలర్లు కాస్త పుంజుకునే ప్రయత్నం చేశారు. వరుసగా మూడు ఓవర్లలో 11, 10, 11 రన్స్ మాత్రమే ఇచ్చారు. ఈ క్రమంలో కొయెట్జీ బౌలింగ్‌‌లో సింగిల్‌‌తో శాంసన్ కెరీర్‌‌‌‌లో మూడో సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 76 రన్స్ వద్ద కొయెట్జీ, 94 రన్స్ వద్ద యాన్సెన్‌‌ తన క్యాచ్‌లను డ్రాప్ చేసిన ఇచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్న తిలక్..   సిపమ్లా వేసిన 19వ ఓవర్‌‌‌‌ తొలి బాల్‌‌కు డబుల్ తీసి వరుసగా రెండో సెంచరీ ఖాతాలో వేసుకున్నాడు. అదే ఓవర్లో తను రెండు  ఫోర్లు, ఓ సిక్స్ కొట్టాడు. యాన్సెన్ వేసిన చివరి ఓవర్లో తిలక్ ఫోర్‌‌‌‌, శాంసన్ సిక్స్‌‌ బాదడంతో 280 దాటింది. 

సఫారీలు ఢమాల్

టీమిండియా బ్యాటర్లు చెలరేగిన వికెట్‌‌పై సౌతాఫ్రికా తేలిపోయింది. కొండంత టార్గెట్‌‌ ఛేజింగ్‌‌కు వచ్చిన సఫారీలు పెవిలియన్‌‌కు క్యూ కట్టారు. స్కోరు బోర్డుపై పది రన్స్‌‌ చేరే సరికే నలుగురు టాపార్డర్‌‌‌‌ బ్యాటర్లు వెనక్కి వచ్చేయడంతో ఆతిథ్య జట్టు ఓటమి ఖాయమైంది. ఇన్నింగ్స్ మూడో బాల్‌‌కే ఓపెనర్ రీజా హెండ్రిక్స్‌‌ (0) బౌల్డ్‌‌ చేసిన అర్ష్‌‌దీప్ ఆ టీమ్ పతనం మొదలు పెట్టాడు. పాండ్యా వేసిన రెండో ఓవర్లో మరో ఓపెనర్ రికెల్టన్ (1) కీపర్‌‌‌‌కు క్యాచ్‌‌ ఇచ్చాడు. తన తర్వాతి ఓవర్లో వరుస బాల్స్‌‌లో  కెప్టెన్‌‌ మార్‌‌‌‌క్రమ్ (8), హార్డ్ హిట్టర్ క్లాసెన్ (0)ను అర్ష్‌‌దీప్ పెవిలియన్ చేర్చాడు.

దాంతో సౌతాఫ్రికా 10/4తో ఎదురీత మొదలు పెట్టింది. ఈ దశలో ట్రిస్టాన్‌‌ స్టబ్స్‌‌, డేవిడ్ మిల్లర్‌‌‌‌ క్రీజులో కుదురుకొని ఫోర్లు, సిక్సర్లతో ఎదురుదాడి చేసే ప్రయత్నం చేశారు.  తన బౌలింగ్‌‌లో 6, 4, 6  కొట్టిన  మిల్లర్‌‌‌‌ను ఔట్ చేసిన వరుణ్ చక్రవర్తి ఐదో వికెట్‌‌కు 86 రన్స్ పార్ట్‌‌నర్‌‌‌‌షిప్ బ్రేక్ చేశాడు. తర్వాతి బాల్‌‌కే బిష్ణోయ్ బౌలింగ్‌‌లో స్టబ్స్‌‌ ఎల్బీగా ఔటయ్యాడు. యాన్సెన్ (29 నాటౌట్‌) పోరాడినా.. సిమిలానె (2), కొయెట్జీ (12) నిరాశపరచడంతో సఫారీలకు భారీ ఓటమి తప్పలేదు. 

సంక్షిప్త స్కోర్లు

ఇండియా: 20 ఓవర్లలో 283/1 (తిలక్ 120 నాటౌట్‌‌, శాంసన్ 109 నాటౌట్‌‌, సిపమ్లా 1/58).
సౌతాఫ్రికా: 18.2 ఓవర్లలో148 ఆలౌట్‌ (స్టబ్స్‌‌ 43, మిల్లర్ 36, అర్ష్‌‌దీప్ 3/20, అక్షర్ 2/6)

  • 210*  తిలక్‌, శాంసన్ రెండో వికెట్‌కు అజేయంగా జోడించిన రన్స్‌. టీ20ల్లో ఏ వికెట్‌‌‌‌కైనా ఇండియాకు ఇదే అత్యధిక భాగస్వామ్యం.  రెండో వికెట్‌‌‌‌కుఏ జట్టుకైనా అత్యధికం.
  • 23 ఇండియా ఇన్నింగ్స్‌‌‌‌లో సిక్సర్లు. రెండు ఐసీసీ ఫుల్‌‌‌‌ మెంబర్స్‌‌‌‌ దేశాల మధ్య టీ20లో అత్యధికం. హైదరాబాద్‌‌‌‌లో గత నెల బంగ్లాదేశ్‌‌‌‌పై 22 సిక్సర్ల రికార్డును ఇండియా బ్రేక్‌‌‌‌ చేసింది. 
  • 5 వరుసగా రెండు టీ20ల్లో సెంచరీలు చేసిన ఐదో ఆటగాడు తిలక్ వర్మ. గుస్టవ్ మెకియోన్‌‌‌‌, రిలీ రొసో, ఫిల్ సాల్ట్‌‌‌‌, సంజూ శాంసన్ ముందున్నారు. 
  • 2 ఐసీసీ ఫుల్‌‌‌‌ మెంబర్స్ జట్ల మధ్య టీ20లో ఒకే ఇన్నింగ్స్‌‌‌‌లో ఇద్దరు సెంచరీలు చేయడం ఇదే తొలి సారి. ఓవరాల్‌‌‌‌గా మూడోసారి.
  • 3 ఈ ఏడాది శాంసన్ సెంచరీలు. ఒక క్యాలెండర్ ఇయర్‌‌‌‌‌‌‌‌లో మూడు టీ20 సెంచరీలు చేసిన తొలి ప్లేయర్‌‌‌‌‌‌‌‌గా రికార్డుకెక్కాడు.