SL vs IND: నిస్సంక అసమాన పోరాటం.. తృటిలో గట్టెక్కిన టీమిండియా

SL vs IND: నిస్సంక అసమాన పోరాటం.. తృటిలో గట్టెక్కిన టీమిండియా

పల్లకెలె వేదికగా భారత్- శ్రీలంక మధ్య జరిగిన తొలి టీ20 థ్రిల్లర్ సినిమాను తలపించింది. 40 ఓవర్ల పూర్తి మ్యాచ్‍లో 35 ఓవర్లు అభిమానులకు నరాలు తెగే ఉత్కంఠను పంచాయి. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంక ఎదుట 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనంతరం ఛేదనకు దిగిన ఆతిథ్య జట్టు ధీటుగా బదులిచ్చింది. లంక ఓపెనర్ పథుమ్ నిశాంక (78) అసమాన రీతిలో పోరాడాడు. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్‌లో సూర్య సేన చివరకు 43 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఓపెనర్ల శుభారంభం 

భారీ ఛేదనలో లంక ఓపెనర్లు కుశాల్ మెండిస్ (39; 25 బంతుల్లో 7 ఫోర్లు, ఒక సిక్స్‌), పథుమ్ నిశాంక (78; 49 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్స్‌లు) మంచి ఆరంభాన్ని ఇచ్చారు. భారత బౌలర్లు వికెట్ కోసం ఎంత శ్రమించినా.. ఈ ద్వయం ఏ చిన్న అవకాశమూ ఇవ్వలేదు. పేసర్లను, స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. తొలి వికెట్ కు వీరిద్దరూ కేవలం 8.4 ఓవర్లలోనే 84 పరుగులు జోడించారు. ఆ సమయంలో అర్ష్‌దీప్ బ్రేక్ ఇచ్చాడు. కీలక సమయంలో మెండిస్‌ను పెవిలియన్ చేర్చాడు. 

వికెట్ పడినప్పటికీ, మరో ఎండ్‌లో నిశాంక తన దూకుడు మాత్రం ఆపలేదు. అలవాటున్న స్వదేశీ పిచ్‌లపై పర్ఫెక్ట్ షాట్లతో అలరించాడు. ఒకానొక సమయంలో మ్యాచ్ చేజారేలా కనిపించింది. ఆ సమయంలో అక్షర్‌ పటేల్ ఆదుకున్నాడు. ప్రమాదకర నిశాంక (79) ఔట్ చేసి లంక శిబిరంలో అలజడి రేపాడు. అక్కడినుంచి ఆతిథ్య జట్టు ఇన్నింగ్స్ గాడి తప్పింది. కమిందు మెండిస్(12) స్వల్ప స్కోరుకే వెనుదిరగ్గా.. చరిత్ అసలంక(0), దాసున్ షనక(0) ఖాతా తెరవకుండానే పెవీలియన్ చేరారు. చివరకు లంకేయులు 19.2 ఓవర్లలో 170 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యారు.  

సమిష్టిగా రాణించిన భారత బ్యాటర్లు

అంతకుముందు భారత బ్యాటర్లు సమిష్టిగా రాణించారు. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(58; 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40; 21 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (34; 16 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరికితోడు రిషబ్ పంత్(49; 33 బంతుల్లో) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు. లంక బౌలర్లలో పతిరణ 4, అసిత ఫెర్నాండో, దిల్షాన్ మధుశంక, హసరంగ తలో వికెట్ పడగొట్టారు.

ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ లో టీమిండియా 1-0 ఆధిక్యంలో నిలిచింది. ఈ ఇరు జట్ల మధ్య ఆదివారం(జులై 28) ఇదే వేదికపై రెండో టీ20 జరగనుంది.