పల్లెకలె వేదికగా శ్రీలంకతో జరిగిన తొలి టీ20లో భారత్ 43 పరుగుల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే. తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా.. లంకేయుల ఎదుట 214 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది. అనతరం ఛేదనలో లంక 19.2 ఓవర్లలో 170 పరుగుల వద్ద ఆలౌటైంది. ఒకానొక సమయంలో ఆతిథ్య జట్టు మ్యాచ్‌పై పట్టు సాధించినా.. భారత బౌలర్లు కట్టుదిట్టమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను భారత్ వశం చేశారు. ఇంతవరకూ బాగానే ఉన్నా, ఈ మ్యాచ్‌లో శ్రీలంక బౌలర్ కమిందు మెండిస్ బౌలింగ్ శైలిపై నెట్టింట పెద్ద చర్చ జరుగుతోంది. అతను ఒకే ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ చేయటమే అందుకు కారణం.
రైట్ ఆర్మ్.. లెఫ్ట్ ఆర్మ్
లెఫ్ట్ ఆర్మ్ లేదా రైట్ ఆర్మ్ ఆర్థాడాక్స్ బౌలర్‌ను ఎదుర్కోవడం బ్యాటర్లకు అంత తేలికైన విషయం కాదు. షార్ట్ రనప్‌తో క్వికర్ బాల్స్ విసురుతుంటారు. ఈ అస్త్రాన్నే మెండిస్ తన ఆయుధంగా మలుచుకున్నాడు. వాస్తవానికి అతను కుడిచేతివాటం ఆఫ్‌బ్రేక్ బౌలర్ అయినప్పటికీ, అవసరమైన సమయాల్లో లెఫ్ట్ ఆర్మ్ బౌలర్ గా మారి బ్యాటర్లను ఇబ్బంది పెడుతుంటాడు. శనివారం భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఈ స్పిన్నర్ అలానే బంతులేశాడు.
భారత ఇన్నింగ్స్ 10వ ఓవర్ వేయడానికి బంతి అందుకొన్న మెండిస్ అదే ఓవర్‌లో రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. తొలి బంతిని సూర్య ఎదుర్కొనగా.. లెఫ్ట్‌ఆర్మ్ బౌలింగ్ చేశాడు. అదే ఓవర్ మూడో బంతిని రిషభ్ పంత్ ఎదుర్కొనగా.. మెండిస్ అనూహ్యంగా రైట్‌ఆర్మ్ శైలిలో బౌలింగ్ చేశాడు. దీంతో ఒకే ఓవర్‌లో రెండు చేతులతోనే బౌలింగ్ చేసినట్లైంది. ఇదే సోషల్ మీడియాలో తీవ్ర చర్చకు దారితీసింది. అసలు ఇలా చేయొచ్చా? ఇలాంటి ఘటనల్లో ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి..? అనే ప్రశ్నలు తలెత్తాయి.
Kamindu Mendis bowling left arm to Suryakumar Yadav and right arm to Rishabh Pant. 😄👌 pic.twitter.com/ZBBvEbfQpS
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 27, 2024
ఐసీసీ రూల్స్ ఏం చెప్తున్నాయి..?
నిజానికి ఒక చేతితోనే బంతిని వేయాలన్న నిబధన ఐసీసీ రూల్స్‌లో ఎక్కడా లేదు. రెండు చేతులతో బౌలింగ్ చేయవచ్చు. కాకపోతే, బంతిని వేసే సమయంలో బౌలర్ తన శైలి ఏంటనేది అంపైర్‌కు తెలియజేయాలి. ఐసీసీ ఆర్టికల్ 21.1.1 రూల్ ప్రకారం.. సదరు బౌలర్ కుడిచేతితో బంతినేస్తాడా? ఎడమ చేతితో బౌలింగ్ చేస్తాడా? అనేది అంపైర్‌కు ముందే చెప్పాలి. అదే సమయంలో స్టంప్‌కు ఎటువైపు నుంచి వేస్తున్నారనేది కూడా అంపైర్ దృష్టికి తీసుకెళ్లాలి. ఆ విషయాన్ని బ్యాటర్‌కు అంపైర్ తెలియజేస్తాడు. ఒకవేళ బౌలర్ తన బౌలింగ్ శైలిని మార్చుకొన్న విషయాన్ని అంపైర్‌కు తెలపకుండా.. బంతిని వేస్తే దానిని ‘నో బాల్’గా ప్రకటిస్తారు. ఈ నిబంధనలు బట్టి మెండిస్ బౌలింగ్ శైలి అంగీకరించదగినదే.