IND vs SL: మారని లంక బ్యాటర్ల ఆట.. భారత ఎదుట సాధారణ లక్ష్యం

IND vs SL: మారని లంక బ్యాటర్ల ఆట.. భారత ఎదుట సాధారణ లక్ష్యం

భారత్‌తో తొలి వన్డేలో విఫలమైన ఆతిథ్య లంక బ్యాటర్లు.. రెండో వన్డేలోనూ అదే ఆట తీరు కనపరిచారు. మంచి ఆరంభాలు లభించినప్పటికీ, ఏ ఒక్క బ్యాటరూ 50 పరుగులు కూడా దాటలేకపోయారు. టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40), దునిత్ వెల్లలాగే(39), కుసాల్ మెండిస్(30) పరుగులు చేశారు. 

తొలి బంతికే వికెట్

టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన లంక తొలి బంతికే వికెట్ కోల్పోయింది. ఫామ్‌లో ఉన్న పతుమ్ నిశాంక(0)ను ఇన్నింగ్స్ మొదటి బంతికే సిరాజ్ పెవిలియన్ చేర్చాడు. దాంతో, ఆతిథ్య జట్టు పరుగుల ఖాతా తెరవకుండానే వికెట్ కోల్పోయింది. ఆ సమయంలో ఆవిష్క ఫెర్నాండో(40), కుశాల్ మెండిస్(30) జోడి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. రెండో వికెట్‌కు 74 పరుగులు జోడించారు. దాంతో, ఆతిథ్య జట్టు.. భారత ఎదుట సరైన లక్ష్యాన్ని నిర్ధేస్తుందని అంతా అనుకున్నారు. 

వరుస ఓవర్లలో వికెట్లు 

74 పరుగులతో పటిష్టస్థితిలో ఉన్న లంక వాషింగ్టన్ సుందర్ దెబ్బకొట్టాడు. వరుస ఓవర్లలో ఫెర్నాండో, మెండిస్‌లను ఔట్ చేశాడు. దాంతో, ఆతిథ్య జట్టు 5 పరుగుల వ్యవధిలోనే 2 కీలక వికెట్లు కోల్పోయింది. తరువాత వచ్చిన సదీర సమరవిక్రమ(14), చరిత్ అసలంక(25) దూకుడుగా ఆడలేకపోయారు. ఒకానొక సమయంలో లంక 136 పరుగులకే 6 వికెట్లు  కోల్పోయింది. ఆ సమయంలో కమిందు మెండిస్(40), దునిత్ వెల్లలాగే(39) ఆదుకున్నారు. ఈ జోడి ఏడో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అయితే, ఏ ఒక్క బ్యాటరూ భారీ ఇన్నింగ్స్ ఆడకపోవడం లంకను నష్ట పరిచింది. 

భారత బౌలర్లలో వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లు తీసుకోగా.. కుల్దీప్ యాదవ్ 2, అక్షర్ పటేల్, మహ్మద్ సిరాజ్ చెరొక వికెట్ తీసుకున్నారు.