IND vs SL: తిప్పేసిన లంక స్పిన్నర్లు.. టీమిండియా ఘోర పరాజయం

IND vs SL: తిప్పేసిన లంక స్పిన్నర్లు.. టీమిండియా ఘోర పరాజయం

శ్రీలంక పర్యటనలో టీ20 సిరీస్ అలవోకగా నెగ్గిన భారత జట్టుకు.. వన్డేల్లో మాత్రం ఆతిథ్య జట్టు నుంచి గట్టి ప్రతిఘటన ఎదురవుతోంది. లంకేయులు నిర్ధేశించే లక్ష్యం చిన్నదయినప్పటికీ, దానిని కాపాడుకోవడంలో శాయశక్తులూ ఒడ్డుతున్నారు. శక్తికి మించి పోరాడుతున్నారు. అదే వారికి మంచి ఫలితాలు అందిస్తోంది. తొలి వన్డేను ఓటమి నుంచి 'టై'గా వరకు తీసుకెళ్లిన లంక.. రెండో వన్డేను ఏకంగా ఓటమి నుంచి.. విజయంగా మార్చింది.

తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేసింది. అవిష్క ఫెర్నాండో(40), కమిందు మెండిస్(40), దునిత్ వెల్లలాగే(39) పరుగులు చేశారు. అనంతరం ఛేదనలో భారత జట్టు 42.2 ఓవర్లలో 208 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. వికెట్ నష్టపోకుండా 97 పరుగులు చేసిన రోహిత్ సేన.. ఆ తరువాత ప్రత్యర్థి జట్టు స్పిన్నర్లకు దాసోహమైపోయింది. 64 పరుగులతో రోహిత్ మంచి ఆరంభాన్ని ఇచ్చినప్పటికీ, తరువాత వచ్చిన బ్యాటర్లు విఫలమయ్యారు. లోయర్ ఆర్డర్‌లో అక్సర్ పటేల్(44) పర్వాలేదనిపించాడు.

దాయాది దేశం అడుగుజాడల్లో 

నిజానికి ఇలాంటి ఇన్నింగ్స్‌లు దాయాది పాకిస్థాన్ జట్టుకు బాగా అలవాటు. ఉన్నట్టుంది టపటపా వికెట్లు పోగొట్టుకొని మ్యాచ్‌ను ప్రత్యర్థి జట్టుకు అప్పగిస్తుంటారు. భారత బ్యాటర్లు అచ్చం అలాంటి ఆటనే ఈ మ్యాచ్‌లో కనపరిచారు. క్రీజులో నిలబడటం అయిష్టంగా ఉన్నట్లు వికెట్లు పారేసుకున్నారు. రోహిత్(64), అక్సర్ పటేల్(44), గిల్(35) మినహా అందరూ విఫలమయ్యారు. విరాట్ కోహ్లీ(14), శివం దూబే(0), శ్రేయాస్ అయ్యర్(7), కేఎల్ రాహుల్(0).. చూస్తుండగానే బంతుల వ్యవధిలో పెవిలియన్ చేరిపోయారు.

ఓటమిని శాసించిన వాండర్సే

ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికి, లంక విజయానికి ఒక్కడే కారణం. అతనే.. జెఫ్రీ వాండర్సే. వికెట్ నష్టపోకుండా 97 పరుగులతో పటిష్టంగా ఉన్న భారత జట్టును వాండర్సే తన మణికట్టు మాయతో ఓటమి చెంతకు చేర్చాడు. స్పిన్, వైవిధ్యమైన బౌన్స్‌తో ప్రపంచకప్ వీరులకు చుక్కలు చూపించాడు. ఏకంగా 7 వికెట్లు సాధించి ప్లేయర్ అఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. అతనికి సహాయంగా లంక కెప్టెన్ చరిత అసలంక 3 వికెట్లు పడగొట్టి తాను ఎంత విలువైన బౌలరో నిరూపించాడు.

కాగా, మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో లంక 1-0 ఆధిక్యంలో ఉంది. ఈ ఇరు జట్ల మధ్య ఆఖరి వన్డే ఆగష్టు 07న బుధవారం జరగనుంది.