IND vs SL: ఒక్కడే 6 వికెట్లు.. తీవ్ర కష్టాల్లో టీమిండియా

IND vs SL: ఒక్కడే 6 వికెట్లు.. తీవ్ర కష్టాల్లో టీమిండియా

కొలొంబో వేదికగా భారత్, శ్రీలంక మధ్య జరుగుతోన్న రెండో వన్డే హోరాహోరీగా సాగుతోంది. లంకేయులు నిర్ధేశించిన 241 పరుగుల స్వల్ప చేధనలో భారత బ్యాటర్లు తడబడుతున్నారు. ఛేదనలో టీమిండియా 147 పరుగులకే 6 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. లంక లెగ్ స్పిన్నర్ జెఫ్రీ వాండర్సే భారత బ్యాటర్లకు ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. స్పిన్, వైవిధ్యమైన బౌన్స్‌తో ప్రపంచకప్ వీరులకు చుక్కలు చుక్కలు చూపిస్తున్నాడు. పడిన 6 వికెట్లూ అతను పడగొట్టినవే.

97 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యం

ఛేదనలో భారత జట్టుకు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు రోహిత్ శర్మ (64; 44 బంతుల్లో 5 ఫోర్లు 4 సిక్స్‌లు), శుభమన్ గిల్(45 బంతుల్లో 35) జోడి 97 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. 97 పరుగుల వద్ద రోహిత్ శర్మ రూపంలో తొలి వికెట్ కోల్పోయింది. అక్కడి నుంచి భారత పతనం ఆరంభమైంది. వరుస విరామాల్లో వికెట్లు పడుతూనే ఉన్నాయి. శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ(14), శివం దూబే(0), శ్రేయాస్ అయ్యర్(7), కేఎల్ రాహుల్(0).. ఇలా అందరూ పెవిలియన్ చేరిపోయారు. ఆదుకోవడానికి ఏ ఒక్క బ్యాటరూ క్రీజులో లేడు. 

అక్సర్‌పైనే ఆశలు 

ప్రస్తుతానికి అక్షర్ పటేల్(17 బంతుల్లో 24 పరుగులు) ఒక్కడే నిలకడగా ఆడుతున్నాడు. వేగంగా ఆడుతూ పరుగులు రాబడుతున్నాడు. అతను రాణించడం పైనే భారత జట్టు విజయావకాశాలు ఆధారపడి ఉన్నాయి. మరో ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ కూడా బ్యాటింగ్ చేయగల సమర్థుడే. దాంతో, మ్యాచ్ హోరాహోరీగా సాగుతోంది.