IND vs SL: సూర్య మిరాకిల్ బౌలింగ్.. సూపర్ ఓవర్‌లో భారత్ విక్టరీ

IND vs SL: సూర్య మిరాకిల్ బౌలింగ్.. సూపర్ ఓవర్‌లో భారత్ విక్టరీ

సొంతగడ్డపై లంకకు కోలుకోలేని ఓటమిది. గెలవాల్సిన మ్యాచ్‌లో చేజేతులా ఓడారు. పల్లకెలె వేదికగా శ్రీలంకతో జరిగిన ఆఖరి టీ20లో టీమిండియా సూపర్ ఓవర్‌లో విజయం సాధించింది. సూపర్‌ ఓవర్‌లో లంక మూడు బంతుల్లో కేవలం రెండు పరుగులు చేయగా.. సూర్య తొలి బంతికే ఫోర్‌ కొట్టి విజయాన్ని అందించాడు. అంతకుముందు ఇరు జట్లు నిర్ణీత ఓవర్లలో 137 పరుగుల చొప్పున స్కోర్లు చేయడంతో మ్యాచ్ టై అయ్యి.. సూపర్ ఓవర్‌కు దారి తీసింది.
 
నిజానికి ఇది భారత జట్టు సాధించిన విజయం కాదు. ఆతిథ్య జట్టు బ్యాటర్లే గెలిపించారు. మొదట లంక విజయానికి చివరి రెండు ఓవర్లలో 9 పరుగులు కావల్సివున్నా.. చేయలేకపోయారు. అందునా, ఆ చివరి రెండు ఓవర్లు వేసిన బౌలర్లు.. రింకూ సింగ్, సూర్యకుమార్ యాదవ్. 19వ ఓవర్‌లో రింకూ 3 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టగా.. ఆఖరి ఓవర్‌లో సూర్య 6 పరుగులను డిఫెండ్ చేశాడు. కేవలం 5 పరుగులిచ్చి 2 వికెట్లు పడగొట్టాడు. దాంతో, మ్యాచ్ టై అయ్యి.. సూపర్ ఓవర్‌కు వెళ్లింది.

ఓపెనర్ల జోరు

138 పరుగుల స్వల్ప ఛేదనలో శ్రీలంకకు మంచి ఆరంభం లభించింది. తొలి వికెట్‌కు ఓపెనర్లు పతుమ్ నిశాంక(26), కుసాల్ మెండిస్(43) జోడి 58 పరుగులు జోడించారు. అనంతరం నిశాంక వెనుదిరిగిన క్రీజులోకి వచ్చిన కుషాల్  పెరీరా(45 నాటౌట్).. మెండిస్‌తో జత కలిసి మరో భాగస్వామ్యం నెలకొల్పాడు. అయితే, లంక విజయానికి చివరి 4 ఓవర్లలో 25 పరుగులు కావాల్సిన సమయంలో సుందర్ కాసేపు భయపెట్టాడు. వరుస బంతుల్లో హసరంగా(3), అసలంక(0) ఇద్దరినీ పెవిలియన్ చేర్చాడు. దాంతో, మ్యాచ్ మరోసారి ఆసక్తి రేకెత్తించింది. చివరలో రింకూ సింగ్ సైతం  ఒకే ఓవర్‌లో  రెండు వికెట్లు పడగొట్టడంతో లంక డగౌట్‌లో టెన్షన్ వాతావరణం కనిపించింది. ఇక ఆఖరి ఓవర్ లో ఆతిథ్య జట్టు విజయానికి 6 పరుగులు అవసరం కాగా.. సూర్య తన అద్భుత బౌలింగ్‌తో టై చేశాడు.

గిల్ నిలకడ.. పరాగ్ దూకుడు

అందుకుముందు తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 137 పరుగులు చేసింది. 30 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి వందలోపే ఆలౌట్ అయ్యేలా కనిపించిన భారత జట్టును శుభ్‌మన్‌ గిల్(39), రియాన్‌ పరాగ్(26) జోడి ఆదుకున్నారు. చివరలో వాషింగ్టన్‌ (25) పర్వాలేదనిపించారు. ఇతర బ్యాటర్లంతా విఫలమయ్యారు. శ్రీలంక బౌలర్లలో తీక్షణ 3, హసరంగ 2 వికెట్లు తీయగా.. విక్రమసింఘె, అసితా, మెండిస్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

ఆగష్టు 2 నుంచి వన్డే సిరీస్

ఈ ఇరు జట్ల మధ్య ఆగష్టు 2 నుంచి మూడు మ్యాచ్ ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. మ్యాచ్‌లన్నీ కొలొంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం, మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి. 

వన్డే సిరీస్ షెడ్యూల్:

  • మొదటి వన్డే: ఆగస్టు 2 (శుక్రవారం) 
  • రెండో వన్డే: ఆగస్టు 4 (ఆదివారం)
  • మూడో వన్డే: ఆగస్టు 7 (బుధవారం)