'ఇంట్లో పులి.. వీధిలో పిల్లి..' ఈ నానుడి భారత క్రికెటర్, చెన్నై సూపర్ కింగ్స్ యువ ఆల్ రౌండర్ శివమ్ దూబేకు బాగా సరిపోతుంది. క్యాష్ రిచ్ లీగ్ ఐపీఎల్‌లో పరుగుల వరద పారించే ఈ వీరుడు.. దేశానికొచ్చేసరికి బ్యాట్ ఝుళిపించలేకపోతున్నాడు. బంతి బ్యాట్‌ను తగిలితే ఎక్కడ చేతులు నొప్పెడతాయో అన్నట్లుగా ఆడుతున్నాడు. అందునా, నిల్చొన్న చోట నుంచి కాలు కదిలించలేకపోతున్నాడు.
తొలి వన్డేలో 25 పరుగులు చేసిన దూబే, రెండో వన్డేలో ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు. నాలుగు బంతులాడి డకౌట్‌గా వెనుదిరిగాడు. అందునా, అతను ఔటైన తీరు విమర్శలకు దారి తీసింది. బంతి తన వైపు దూసుకొస్తుంటే, ఈ భారత ఆల్‌రౌండర్ కాలు కదిలించక పోవటం గమనార్హం. పోనీ, బౌలింగ్‌లో మెప్పించాడా అంటే అదీ లేదు. కేవలం రెండు ఓవర్లు బౌలింగ్ చేయగలిగాడు. దాంతో, లంకతో జరగబోయే ఆఖరి వన్డేలో అతనిపై వేటు పడనుందని సమాచారం.
పరాగ్ అరంగ్రేటం
లంక పర్యటనలో టీ20ల్లో ఎంట్రీ ఇచ్చిన రియాన్ పరాగ్.. బుధవారం జరగనున్న ఆఖరి వన్డేతో 50 ఓవర్ల ఫార్మాట్‌లోనూ అరంగ్రేటం చేయనున్నాడట. ఎలానూ దూబే బౌలింగ్‌లోనూ రాణించలేకపోతున్నాడు కనుక అతని స్థానంలో రాజస్థాన్ రాయల్స్ బ్యాటర్ భారత తుది జట్టులో చోటు దక్కించుకోనున్నాడని సమాచారం. పరాగ్ బ్యాటింగ్‌లోనే, బౌలింగ్‌లోనూ సత్తా చాటగలడు. తన స్పిన్ అస్త్రంతో ప్రత్యర్థి బ్యాటర్లను పరుగులు చేయకుండా కట్టడి చేయగలడు. దాంతో, అతను ఎంట్రీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది.
మూడో వన్డేకు భారత జట్టు (అంచనా): రోహిత్ శర్మ(కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్(వికెట్ కీపర్), రియాన్ పరాగ్, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, అర్షదీప్ సింగ్.