శ్రీలంకపై టీ20 సిరీస్ నెగ్గి మంచి ఊపుమీదున్న టీమిండియా.. రేపటి నుంచి ఆతిథ్య జట్టుతో వన్డేల్లో తలపడనుంది. ఈ ఇరు జట్ల మధ్య శుక్రవారం(ఆగష్టు 2) నుంచి మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. ఆతిథ్య లంక టీమ్ కు కుశాల్ మెండిస్ నాయకత్వం వహించనున్నాడు.
వంద విజయాలు
శుక్రవారం లంకతో జరగనున్న తొలి వన్డే భారత జట్టుకు చారిత్రాత్మకం కానుంది. ఈ మ్యాచ్‌లో రోహిత్ సేన విజయం సాధిస్తే, ఒకే ప్రత్యర్థిపై 100 వన్డే విజయాలు నమోదు చేసిన మొదటి జట్టుగా అవతరిస్తుంది. ఇప్పటివరకూ లంకపై టీమిండియా 168 వన్డేల్లో 99 విజయాలు నమోదు చేసింది.
ఆస్ట్రేలియా 96 విజయాలు
ఒకే ప్రత్యర్థిపై అత్యధిక వన్డే విజయాలు సాధించిన జాబితాలో ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్‌పై ఆసీస్ 142 వన్డేల్లో 96 విజయాలు సాధించింది. ఇక శ్రీలంకపై 157 వన్డేల్లో 93 విజయాలతో పాకిస్థాన్ మూడో స్థానంలో ఉంది.
వన్డేల్లో ఒకే ప్రత్యర్థిపై అత్యధిక విజయాలు
- 99 విజయాలు - భారత్ (శ్రీలంకపై)
- 96 విజయాలు - ఆస్ట్రేలియా (న్యూజిలాండ్‌పై )
- 93 విజయాలు - పాకిస్థాన్ (శ్రీలంకపై)
- 88 విజయాలు - ఆస్ట్రేలియా (ఇంగ్లాండ్ పై)
- 84 విజయాలు - ఆస్ట్రేలియా (భారత్ పై)
ఇదిలావుంటే, భారత్ తో తొలి వన్డేకు ముందు లంకకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్లు మతీషా పతిరనా, దిల్షాన్ మధుశంక గాయాల కారణంగా జట్టుకు దూరమయ్యారు. దాంతో, వారి స్థానంలో అన్‌క్యాప్డ్ ఫాస్ట్ బౌలర్లు మహ్మద్ షిరాజ్, ఎషాన్ మలింగలను జట్టులోకి తీసుకున్నారు.
భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్ మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్ (వికెట్ కీపర్), రిషబ్ పంత్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్, శివమ్ దూబే, కుల్దీప్ యాదవ్ , మహ్మద్. సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్ , హర్షిత్ రాణా.
శ్రీలంక వన్డే జట్టు: చరిత్ అసలంక (కెప్టెన్), పతుమ్ నిస్సాంక, అవిష్క ఫెర్నాండో, కుసల్ మెండిస్, సదీర సమరవిక్రమ, కమిందు మెండిస్, జనిత్ లియానాగే, నిషాన్ మదుష్క, వనిందు హసరంగా, దునిత్ వెల్లలాగే, చమిక కరుణరత్నే, మతీష పతిరణ, అసిత ఫెర్నాండో, మహ్మద్ షిరాజ్, ఎషాన్ మలింగ.