IND vs SL: 'టై'గా ముగిసిన భారత్ - శ్రీలంక తొలి వన్డే.. No సూపర్ ఓవర్

IND vs SL: 'టై'గా ముగిసిన భారత్ - శ్రీలంక తొలి వన్డే.. No సూపర్ ఓవర్

కొలంబో వేదికగా భారత్‌, శ్రీలంక జట్ల మధ్య జరిగిన తొలి వన్డే 'టై'గా ముగిసింది. తొలుత బ్యాటింగ్ శ్రీలంక నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. ప‌థుమ్ నిశాంక‌(52), దునిత్ వెల్ల‌లాగే(67 నాటౌట్) హాఫ్ సెంచరీలు చేశారు. అనంతరం ఛేదనలో భారత జట్టు సరిగ్గా 230 పరుగుల వద్ద ఆలౌట్ అయ్యింది. దాంతో, మ్యాచ్ ఫలితం తేలకుండానే ముగిసింది. 

రెండు బంతుల్లో రెండు వికెట్లు

భారత జట్టు విజ‌యానికి చివరి 15 బంతుల్లో ఒకే ఒక్క ప‌రుగు కావాలి. చేతిలో రెండు వికెట్లు ఉన్నాయి. అయినప్పటికీ, లక్ష్యాన్ని చేరుకోలేకపోయారు. ఓటమి అంచున ఆతిథ్య జట్టు కెప్టెన్ చ‌రిత అల‌సంక అద్భుతం చేశాడు. వ‌రుస బంతుల్లో దూబే, అర్ష్‌దీప్ సింగ్‌(0)ల‌ను ఎల్‌బిడబ్ల్యుగా వెన‌క్కి పంపి మ్యాచ్‌ను టైగా ముగించాడు.

భారత బ్యాటర్లలో కెప్టెన్ రోహిత్ శ‌ర్మ(58) హాఫ్ సెంచ‌రీ చేయగా.. కేఎల్ రాహుల్(31, అక్షర్ ప‌టేల్‌(33), శివం దూబే(25)లు పర్వాలేదనిపించారు.

సూపర్ ఓవర్ ఎందుకు లేదు..?

మ్యాచ్ టై అయితే, టీ20ల మాదిరిగా 50 ఓవర్ల ఫార్మాట్‌లో ఫలితం నిర్ధారించడానికి సూపర్ ఓవర్ నిర్వహించాలన్న నిబంధన లేదు. అందునా, ప్రతి సిరీస్ లేదా టోర్నమెంట్‌కు ఆడే నిబంధనలు భిన్నంగా ఉంటాయి. ఉదాహరణకు వన్డేలలో బహుళ-దేశాల ఈవెంట్‌ల నాకౌట్ మ్యాచ్‌లకు మాత్రమే సూపర్ ఓవర్‌ నిర్వహిస్తుంటారు. 

ఇప్పటివరకు కేవలం మూడు వన్డేలకు మాత్రమే సూపర్ ఓవర్‌ నిర్వహించారు. 2019 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ సంధర్బంగా ఇంగ్లాండ్ - న్యూజిలాండ్ మధ్య జరిగిన సూపర్ ఓవర్ అందులో ఒకటి. అలాగే, 2020లో రావల్పిండి క్రికెట్ స్టేడియంలో జింబాబ్వే, పాకిస్తాన్ మధ్య జరిగే వన్డే సూపర్ ఓవర్‌ నిర్వహించిన ఏకైక ద్వైపాక్షిక వన్డేగా మిగిలిపోయింది. ఇక చివరిసారిగా గతేడాది వెస్టిండీస్, నెదర్లాండ్స్ జట్ల మధ్య ఐసీసీ క్రికెట్ ప్రపంచ కప్ 2023 క్వాలిఫైయర్ వన్డే పోరులో సూపర్ ఓవర్ జరిగింది.