IND vs SL: భారత్‌తో వన్డే సిరీస్.. లంక జట్టులోకి మలింగా, షిరాజ్

IND vs SL: భారత్‌తో వన్డే సిరీస్.. లంక జట్టులోకి మలింగా, షిరాజ్

ఆగష్టు 2 నుంచి భారత్, శ్రీలంక జట్ల మధ్య మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్ ప్రారంభం కానుంది. భారత జట్టుకు రోహిత్ శర్మ సారథ్యం వహించనుండగా.. ఆతిథ్య లంక జట్టుకు కుశాల్ మెండిస్ నాయకత్వం వహించనున్నాడు. ఈ సిరీస్ మరికొన్ని గంటల్లో ప్రారంభం కానుండగా.. లంక జట్టులో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. 

గాయం కారణంగా స్టార్ పేసర్లు మతీషా పతిరణ, దిల్షాన్ మధుశంక ఈ సిరీస్ నుంచి తప్పుకున్నారు. దాంతో, వీరి స్థానంలో లంక క్రికెట్ బోర్డు(SLC) కొత్త పేర్లు ప్రకటించింది. యువ క్రికెటర్లు మహ్మద్ షిరాజ్, ఎషాన్ మలింగలను జట్టులోకి తీసుకుంది. 

ఎషాన్ మలింగ

23 ఏళ్ల ఎషాన్ మలింగ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, రైట్ ఆర్మ్ బౌలర్. గంటకు 140 కి.మీ. వేగంతో బంతులు వేయగలడు. ఈ యువ పేసర్ లంక ప్రీమియర్ లీగ్‌లో కొలంబో స్ట్రైకర్స్, జాఫ్నా జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. శ్రీలంక ఎమర్జింగ్ టీమ్ తరుపున బరిలోకి దిగాడు. ఇప్పటివరకూ  14 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 28 వికెట్లు, 8 టీ20ల్లో 7 వికెట్లు పడగొట్టాడు.

మహ్మద్ షిరాజ్

షిరాజ్ అసలు పేరు.. కటుపుల్లే గెదర మహమ్మద్ షిరాజ్ సాహెబ్. ఇతగాడు రైట్ ఆర్మ్ మీడియ పేసర్. ఇప్పటివరకూ గాలే మార్వెల్స్, దంబుల్లా, గాలే గ్లాడియేటర్స్, శ్రీలంక ఎ, శ్రీలంక బోర్డు ప్రెసిడెంట్స్ XI జట్ల తరుపున ఆడాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో 49 మ్యాచ్‌ల్లో 125 వికెట్లు పడగొట్టాడు. 

పేసర్లు పదే పదే గాయపడతుండంతో లంక క్రికెట్ బోర్డు మరో నిర్ణయమూ తీసుకుంది. పైఇద్దరితో పాటు కుసల్ జనిత్, ప్రమోద్ మదుషన్, జెఫ్రీ వాండర్సేలను స్టాండ్ బైలుగా ఎంపిక చేసింది. జట్టులో ఎవరేని ఆటగాడు గాయపడితే, ఆ స్థానాలను వీరితో భర్తీ చేయనుంది.

వన్డే సిరీస్ షెడ్యూల్:

  • మొదటి వన్డే: ఆగస్టు 2 (శుక్రవారం) 
  • రెండో వన్డే: ఆగస్టు 4 (ఆదివారం)
  • మూడో వన్డే: ఆగస్టు 7 (బుధవారం)

మ్యాచ్‌లన్నీ కొలొంబోలోని ప్రేమదాస అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనున్నాయి. భారత కాలమానం ప్రకారం, మ్యాచ్‌లు మధ్యాహ్నం 2:30 గంటలకు ప్రారంభం కానున్నాయి.