IND vs SL: లంక బౌలర్ల విజృంభణ.. తేలిపోయిన యువ కెరటాలు

IND vs SL: లంక బౌలర్ల విజృంభణ.. తేలిపోయిన యువ కెరటాలు

శ్రీలంకపై తొలి రెండు టీ20ల్లో పరుగుల వరద పారించిన భారత యువ కెరటాలు.. ఆఖరి టీ20లో మాత్రం తేలిపోయారు. ఆతిథ్య జట్టు బౌలర్లు విజృంభించడంతో.. క్రీజులో నిలబడలేక పెవిలియన్‌కు క్యూ కట్టారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 139 పరుగులు చేసింది. భారత బ్యాటర్లలో శుభ్‌మన్ గిల్(37 బంతుల్లో 39), రియాన్ పరాగ్(18 బంతుల్లో 26) పర్వాలేదనిపించారు.

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ను.. తీక్షణ  ఆదిలోనే దెబ్బకొట్టాడు. భీకర ఫామ్‌లో ఉన్న జైస్వాల్(10)ను ఔట్ చేసి భారత శిబిరంలో అలజడి రేపాడు. ఆ మరుసటి ఓవర్‌లోనే శాంసన్(0)ను విక్రమసింఘే బోల్తా కొట్టించాడు. తరువాత క్రీజులోకి వచ్చిన రింకూ సింగ్(1), సూర్యకుమార్ యాదవ్ (8) సైతం వెంటవెంటనే పెవిలియన్ చేరారు. దాంతో, టీమిండియా 30 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయింది. ఆపై కీలక సమయంలో దూబే(13) కూడా ఔట్ అవ్వడంతో టీమిండియాకు కష్టాలు మరింత పెరిగాయి.

అడ్డుగోడలా గిల్- పరాగ్ జోడి 

48 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన భారత జట్టును శుభ్ మన్ గిల్(39), రియాన్ పరాగ్(26) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ జోడి వికెట్ల పతనాన్ని అడ్డుకోవడంతో పాటు ఐదో వికెట్‌కు 54 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అయితే, కీలక సమయంలో వీరిద్దరూ వెనుదిరగడంతో భారత్.. లంక ఎదుట సరైన లక్ష్యాన్ని నిర్ధేశించలేకపోయింది. చివరలో బిష్ణోయ్(8 నాటౌట్) సహకారంతో వాషింగ్టన్ సుందర్(18 బంతుల్లో 25 పరుగులు) కాసేపు పోరాడాడు. 

ALSO READ : Smriti Mandhana: ఐసీసీ ర్యాంకింగ్స్‌లో స్మృతి హవా..

లంక బౌలర్లలో తీక్షణ 3, వనిందు హసరంగా 2, విక్రమసింఘే,అసిత ఫెర్నాండో, రమేష్ మెండిస్ వికెట్ చొప్పున పడగొట్టారు.