SL vs IND: చితక్కొట్టిన భారత బ్యాటర్లు.. లంక ఎదుట కొండంత లక్ష్యం

SL vs IND: చితక్కొట్టిన భారత బ్యాటర్లు.. లంక ఎదుట కొండంత లక్ష్యం

సీనియర్ బ్యాటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లేకున్నా.. తాము భారత జట్టును సమర్ధవంతంగా ముందుకు నడిపించగలమనే నమ్మకాన్ని కుర్రాళ్లు నిరూపించారు. బలమైన బౌలింగ్ లైనప్ ఉన్న శ్రీలంక జట్టును వారి గడ్డపైనే తునాతునకలు చేశారు. భయంకరమైన సునామీ అలల్లా బౌండరీలతో విరుచుకు పడ్డారు. ఆతిథ్య జట్టు బౌలర్లకు కనీసం ఊపిరి పీల్చుకునే అవకాశం కూడా ఇవ్వలేదు. ఊచకోత కోశారు. అదే భారత జట్టుకు బలమైన లక్ష్యాన్ని అందించింది. 

పల్లకెలె వేదికగా శ్రీలంకతో జరుగుతోన్న తొలి టీ20లో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 213 పరుగుల భారీ స్కోర్ చేసింది. భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(58; 26 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధ శతకం బాదగా.. ఓపెనర్లు యశస్వి జైస్వాల్ (40; 21 బంతుల్లో), శుభ్‌మన్ గిల్ (34; 16 బంతుల్లో) మెరుపు ఇన్నింగ్స్‌లు ఆడారు. వీరికితోడు రిషబ్ పంత్(49; 33 బంతుల్లో) నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకున్నాడు.

ఆది నుంచే బాదుడు 

టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారత ఓపెనర్లు జైస్వాల్, గిల్ జోడి అది నుంచే బాదడం మొదలుపెట్టారు. మధుశంక వేసిన తొలి ఓవర్‌లో 13 పరుగులు రాబట్టారు. అసిత ఫెర్నాండో వేసిన రెండో ఓవర్‌లో జైస్వాల్ రెండు ఫోర్లు బాదాడు. అలా మొదలైన ఓపెనర్ల విజృంభణ పవర్ ప్లే అంతటా కొనసాగింది. వీరిద్ధరి ధాటికి పవర్ ప్లే లో టీమిండియా వికెట్ నష్టపోయి 74 పరుగులు చేసింది. అనంతరం బంతి తేడాలో ఈ జోడి వెనుదిరిగినా.. సూర్య దానిని కొనసాగించాడు. తన వినూత్న షాట్లతో లంక బౌలర్లలో భయాన్ని పుట్టించిన సూరీడు.. బౌండరీల వర్షం కుపించాడు. కీలక సమయంలో అతను ఔట్ అవ్వడంతో స్కోర్ బోర్డు కాస్త మందగించింది.

లంక బౌలర్లలో హసరంగా, మతీష పతిరాణ మినహా అందరూ విఫలమయ్యారు. దిల్షాన్ మధుశంక 3 ఓవర్లలో 45 పరుగులివ్వగా.. అసిత ఫెర్నాండో 4 ఓవర్లలో 47, మహేశ్ తీక్షణ 44 పరుగులు సమర్పించుకున్నారు.