వీడియో: టీమిండియా గెలుపుకు అడ్డుపడ్డ అంపైర్లు.. ఏం జరిగిందంటే?

వీడియో: టీమిండియా గెలుపుకు అడ్డుపడ్డ అంపైర్లు.. ఏం జరిగిందంటే?

గురువారం వెస్టిండీస్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైన విషయం తెలిసిందే. విండీస్ నిర్దేశించిన 150 పరుగుల లక్ష్య ఛేదనలో భారత బ్యాటర్లు 145 పరుగులకే పరిమితమయ్యారు. అయితే, భారత్ లక్ష్య ఛేదన సమయంలో ఓ సరదా సన్నివేశం చోటు చేసుకుంది.

ఎంత పని చేస్తివి చాహల్

విండీస్ బౌలర్లు చెలరేగడంతో భారత్ చివరి ఓవర్‌లో విజయానికి 10 పరుగులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. బంతి అందుకున్న విండీస్‌ బౌలర్ రొమారియో షెఫెర్డ్‌ తొలి బంతికే కుల్‌దీప్‌ యాదవ్‌‌ను బౌల్డ్‌ చేశాడు. దీంతో భారత్ ఎనిమిదో వికెట్‌ కోల్పోయింది. మిగిలిన ఐదు బంతుల్లో 10 పరుగులు చేయాలి. కుల్‌దీప్‌ ఔట్‌ కాగానే యుజ్వేంద్ర చాహల్‌ బ్యాటింగ్ చేయడానికి మైదానంలోకి అడుగు పెట్టాడు. 

అయితే.. కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యా, హెడ్ కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ మాత్రం చాహల్‌కు బదులు ముకేశ్‌ కుమార్‌ను పంపించాలని భావించారు. ఈ  విషయాన్ని ఉమ్రాన్‌ మాలిక్‌ ద్వారా చాహల్‌కు తెలిసేలా చేశారు. అందుకు సరేనన్న చాహల్ వెంటనే తిరిగి డగౌట్‌ వైపు వెళ్తుండగా.. అంపైర్లు అడ్డుపడ్డారు. ఒక్కసారి మైదానంలోకి పెట్టాక.. బయటకి వెళ్లడం రూల్స్‌కు విరుద్దమని చెప్తూ అతన్నే బ్యాటింగ్ చేయాల్సిందిగా కోరారు. 

క్రీజ్‌లోకి వచ్చిన చాహల్.. ఎదుర్కొన్న తొలి బంతికే సింగిల్ తీసి అర్ష్‌దీప్‌‌కు స్ట్రైక్ ఇచ్చాడు. చాహల్ స్థానంలో ముకేశ్‌ కుమార్‌ వచ్చి ఉంటే టీమిండియా గెలిచేదని అభిమానులు చెప్తున్నారు. రూల్స్ పేరుతో అంపైర్లు టీమిండియా గెలుపుకు అడ్డుపడ్డారని ఆరోపిస్తున్నారు. అందునా బ్యాటింగ్‌ ఆర్డర్‌పై టీమిండియా బ్యాటర్లకు స్పష్టత లేకపోవడం ఏంటన్నది మరో ప్రశ్న. చాహల్ అయోమయానికి గురైన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది.

ఈ విజయంతో ఐదు మ్యాచ్ ల టీ20ల సిరీస్‌లో విండీస్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఈ ఇరు జట్ల మధ్య రెండో మ్యాచ్‌ ఆదివారం(ఆగస్ట్ 6) జరుగుతుంది.