విండీస్‌తో తొలి టీ20.. ప్రపంచంలో రెండో జట్టుగా చరిత్ర సృష్టించనున్న భారత్

విండీస్‌తో తొలి టీ20.. ప్రపంచంలో రెండో జట్టుగా చరిత్ర సృష్టించనున్న భారత్

భారత్, వెస్టిండీస్ మధ్య గురువారం(ఆగస్ట్ 3) నుంచి 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్ ప్రారంభంకానుంది. ట్రినిడాడ్ వేదికగా భారత కాలమాన ప్రకారం.. రాత్రి 8 గంటలకు తొలి టీ20 మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్‌ భారత జట్టుకు.. 200వ టీ20 మ్యాచ్‌. ఇప్పటికే 199 టీ20లు ఆడిన టీమిండియా ఈ మ్యాచ్‌తో 200 మైలురాయిని చేరుకోనుంది. దీంతో అంతర్జాతీయ క్రికెట్‌లో 200 మ్యాచ్‌లు పూర్తి చేసుకున్న రెండో జట్టుగా చరిత్ర సృష్టించనుంది.

అంతర్జాతీయ టీ20ల్లో టీమిండియా ప్రస్థానం

తొలి టీ20 మ్యాచ్

మొదటిసారిగా భారత జట్టు 2006, డిసెంబర్ 1న దక్షిణాఫ్రికాతో తొలి అంతర్జాతీయ టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.

100వ టీ20 మ్యాచ్

జూన్ 27, 2018న టీమిండియా.. ఐర్లాండ్‌తో 100వ టీ20 మ్యాచ్ ఆడింది. ఈ మ్యాచ్‌లో రోహిత్ శర్మ 97 పరుగులతో విజృంభించడంతో భారత జట్టు 76 పరుగుల తేడాతో విజయం సాధించింది.

200వ టీ20 మ్యాచ్

మెన్ ఇన్ బ్లూ నేడు వెస్టిండీస్‌తో జరగనున్న తొలి టీ20తో 200వ టీ20 మ్యాచ్‌లు పూర్తిచేసుకోనుంది. ట్రినిడాడ్‌, తరౌబాలోని బ్రియాన్ లారా స్టేడియం ఈ రికార్డుకు వేదిక కానుంది.

గెలుపోటములు

ఇప్పటివరకు 199 అంతర్జాతీయ టీ20లు ఆడిన టీమిండియా 127 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా.. 63 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. 4 మ్యాచ్‌లు టైగా ముగియగా.. 5 మ్యాచ్‌లు రద్దయ్యాయి. మొత్తంగా టీమిండియా విజయాల శాతం 66.49గా ఉంది.

అగ్రస్థానంలో పాకిస్తాన్

అత్యధిక అంతర్జాతీయ మ్యాచులు ఆడిన దేశాల్లో పాకిస్తాన్ అగ్రస్థానంలో ఉంది. ఇప్పటివరకూ 223 అంతర్జాతీయ టీ20లు ఆడిన పాక్  134 మ్యాచ్‌ల్లో విజయం సాధించగా, 80 మ్యాచ్‌ల్లో ఓటమిపాలైంది. 3 మ్యాచ్‌లు టై కాగా, మరో ఆరు మ్యాచ్‌ల్లో ఫలితం తేలలేదు.