బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలం: తొలి టీ20లో టీమిండియా ఓటమి

బౌలర్లు రాణించినా.. బ్యాటర్లు విఫలం: తొలి టీ20లో టీమిండియా ఓటమి

వ‌న్డే సిరీస్‌లో అద‌ర‌గొట్టిన భార‌త బ్యాటర్లు.. టీ20లో మాత్రం తేలిపోయారు. వెస్టిండీస్ తో జరిగిన తొలి టీ20లో టీమిండియా 4 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. మొదట బ్యాటింగ్ చేసిన విండీస్.. టీమిండియా ముంగిట 150 పరుగుల లక్ష్యాన్ని నిర్ధేశించగా, భారత బ్యాటర్లు దాన్ని చేధించలేకపోయారు. 

టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన విండీస్ నిర్ణీత ఓవర్లలో 6 వికెట్ల న‌ష్టానికి 149 ప‌రుగులుచేసింది. విండీస్ కెప్టెన్ రొవ్‌మ‌న్ పావెల్(48), నికోల‌స్ పూర‌న్‌(41)ప‌రుగుల‌తో రాణించారు. భార‌త బౌల‌ర్ల‌లో చాహ‌ల్ రెండు వికెట్లు ప‌డ‌గొట్టగా.. చైనామెన్ కుల్దీప్ యాద‌వ్, హార్దిక్ పాండ్యా, అర్ష్‌దీప్ సింగ్ త‌లా ఒక‌ వికెట్‌ తీశారు.

అనంతరం 150 పరుగుల నామమాత్రపు లక్ష్య చేధనకు భారత బ్యాటర్లు తడబడ్డారు. యువ ఆటగాడు తిలక్ వర్మ(39; 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లు) మినహా ఏ ఒక్కరూ రాణించలేదు. విజయానికి 30 బంతుల్లో 37పరుగులు కావాల్సిన సమయంలో మ్యాచ్ ఒక్కసారిగా తలకిందులైంది. విండీస్ బౌలర్ జాసన్ హోల్డర్ ఒకే ఓవర్‌లో హార్దిక్ పాండ్యా(19), సంజు సాంసన్(12)ను పెవిలియన్ చేర్చి మ్యాచ్‌ను వెస్టిండీస్ వైపు తిప్పేశాడు. ఆఖరిలో అర్షదీప్ సింగ్ 2 ఫోర్లతో విజయానికి చేరువ చేసినా.. గట్టెకించలేకపోయాడు. విండీస్ బౌలర్లలో రొమారియో షెపర్డ్, హోల్డర్, ఒబెడ్ మెకాయ్ తలా రెండు వికెట్లు తీసుకోగా.. అకీల్ హుస్సేన్ ఒక వికెట్ తీసుకున్నారు.