వెస్టిండీస్ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్‌లను సొంతం చేసుకున్న టీమిండియా.. టీ20 సిరీస్ లో మాత్రం ఆ ఊపును కొనసాగించలేక పోయింది. మూడో టీ20లో విజయం సాధించినప్పటికీ.. తొలి రెండు టీ20ల్లో ఓడి సిరీస్‌ను విండీస్‌కు అప్పచెప్పినంత పని చేసింది. ఈ ప్రదర్శనను పాక్ మాజీ ఆటగాళ్లు అవకాశంగా తీసుకుంటున్నారు. భారత క్రికెటర్ల పేలవ ఆట తీరుపై యూట్యూబ్ వేదికగా జోకులు పేలుస్తున్నారు.
వన్డే వరల్డ్ కప్ 2023 క్వాలిఫైయర్స్‌లో జింబాబ్వే, స్కాట్లాండ్, నెదర్లాండ్స్ వంటి అసోసియేట్ దేశాలపై కూడా గెలవని విండీస్ చేతుల్లో ఓటమి పాలవ్వటం టీమిండియా ప్రతిష్టను మంటగలుపుతోంది. అందునా భారత ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా పదే పదే.. ఒకేసారి మూడు జట్లను తయారుచేసి.. మూడు వేరు వేరు సిరీస్‌లు ఆడించగల సామర్థ్యం టీమిండియాకు ఉందని చెప్పటం నలుగురిలో నవ్వులపాలు చేస్తోంది. తాజాగా పాక్ మాజీ కెప్టెన్, ఫిక్సింగ్ వీరుడు సల్మాన్ బాట్.. ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కీలక వ్యాఖ్యలు చేశాడు.
టీమిండియాని కాపాడుతోంది ఆ ముగ్గురే
తన యూట్యూబ్ ఛానల్ వేదికగా మాట్లాడిన భట్.. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, జస్ప్రీత్ బుమ్రా లేకుంటే భారత జట్టు గురుంచి చెప్పడానికి ఏముండదు అన్నట్లు మాట్లాడాడు. "కోహ్లీ, రోహిత్ శర్మ, బుమ్రా వంటి స్టార్ ప్లేయర్లు లేకపోతే టీమిండియా బలహీన జట్టే. ఎందుకంటే ఇన్నాళ్లు టీమిండియాని కాపాడుకుంటూ వస్తోంది ఈ ముగ్గురి అనుభవమే. మూడు వేరు వేరు జట్లను తయారుచేయగలమని పదే పదే చెప్తున్నారు. అవును చేయొచ్చు.. కానీ విజయాలు మాత్రం అందుకోలేరు."
"నేను భారత ప్లేయర్లను తక్కువ చేసి ఇలా మాట్లాడడం లేదు. ఇండియాలో బోలెడంతమంది క్రికెటర్లు ఉన్నారు. క్వాలిటీ ప్లేయర్లు పుష్కలంగా ఉన్నారు. అయితే సీనియర్లు లేకపోతే జట్టులో నాణ్యత తగ్గుతుంది. ఒత్తిడిని ఎలా ఎదుర్కోవాలో కుర్రాళ్లకు తెలియదు. సీనియర్ ఆటగాళ్ళు ఆ బరువును మోస్తారు. వారి అనుభవం ప్రత్యర్థిపై కూడా తేడాను కలిగిస్తుంది.." అని బట్ తన యూట్యూబ్ ఛానెల్‌లో పేర్కొన్నాడు.
కాగా గతేడాది జరిగిన టీ20 వరల్డ్ కప్ నుండి రోహిత్, కోహ్లీ టీ20లకు దూరంగా ఉండగా.. దాదాపు ఏడాది నుంచి బుమ్రా జట్టుకు దూరంగా ఉంటున్నాడు.